ANDRAPRADESH, AMARAVATHI, ELERE, JUL 31: గోదావరి నదిలో వరద ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత.. కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పోలవరం జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రకర్ జైన్‌తో పాటు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
సమావేశంలో గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. వరద ప్రభావిత జిల్లా, మండలాల్లో 24 గంటల పాటు పనిచేసే అత్యవసర కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని హోంమంత్రి ఆదేశించారు.
ముంపు ముప్పు ఉన్న లంక గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వెంటనే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు హోంమంత్రి అనిత.. బాధితులకు తాగునీరు, నాణ్యమైన ఆహారం, పాలు, అవసరమైన వైద్య సేవలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే గోదావరి వరద ఉధృతి దృష్ట్యా ప్రజలు నదిలో స్నానం చేయడం, చేపల వేటకు వెళ్లడం, సెల్ఫీల కోసం వరద నీటి వద్దకు వెళ్లడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత విజ్ఞప్తి చేశారు. ఇక, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 1800 425 0101కు సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని ఆమె తెలిపారు.

