INDIA NEWS, JUN 09: పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్(POK) అట్టుడుకుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం అణిచివేతకు నిరసనగా పీఓకే ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ హక్కుల కోసం నినాదాలు చేశారు. పీఓకే పాకిస్తాన్ నుంచి విముక్తి కావడానికి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ స్వాతంత్య్రం కోసం ఆందోళనబాట పట్టారు. అయితే, ఈ ఆందోళనల్ని పాక్ ఆర్మీ, పాక్ ప్రభుత్వం అత్యంత క్రూరంగా అణిచివేస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి రిజర్వేషన్ వివాదం కారణమైంది.
పాకిస్తాన్ ఆర్మీ అందోళనల్ని అణిచివేయడానికి కాల్పులు జరిపింది. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మందికి పైగా మరణించారు. సుమారు 200 మంది గాయపడ్డారు. ఈ నిరసనలకు నేతృత్వం వహిస్తున్న ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (JAAC)పై అధికారులు నిషేధం విధించిన తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. శాంతిభద్రతలు, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ అధికారులు శుక్రవారం నాడు జేఏఏసీని నిషేధించింది. శుక్రవారం రాత్రి భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణలో ఒక వ్యాపారి మరణించడంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా రావల్‌కోట్ ప్రాంతంతో ఘర్షణలు చెలరేగాయి.
పోలీస్ కాల్పుల్లో మరణించిన ఒక వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం నాడు ఆస్పత్రి మార్చురీకి తరలించగా జేఏఏసీ నిరసనకారులు అక్కడ గుమిగూడారు. అయితే, నిరసనకారులు తమపై ఆటోమెటిక్ రైఫిళ్లు, పెట్రోల్ బాంబులతో దాడులు చేశారని పోలీసులు ఆరోపించారు. జూలై 27న జరగనున్న ప్రాంతీయ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 45 స్థానాలకు గానూ శరణార్థులకు 12 స్థానాలు కేటాయించడంపై ప్రజలు నిరసనలు ప్రారంభించారు.

