Ticker

6/recent/ticker-posts

పారిజాతగిరి బ్రహ్మోత్సవాల్లో ఘనంగా ధ్వజారోహణం


ఏలూరు, మే 10: పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఆధ్యాత్మిక వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు నిర్వహించిన ధ్వజారోహణం, విశ్వక్సేన పూజ, అగ్ని ప్రతిష్ఠ వంటి శాస్త్రోక్త కార్యక్రమాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


ఉదయం 8 గంటల నుంచి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ, కుంభస్థాపన, నిత్య హోమం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవాధ్యక్షులు పేరిచర్ల జగపతి రాజు, శ్రీమతి ఝాన్సీరాణి, సభ్యులు గొట్టుముక్కల భాస్కరాజు దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు.

కోనంగపల్లి సత్యపవన్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు, కుమారాచార్యులు, రాఘవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు గరుడ ప్రసాదం పంపిణీ చేశారు. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందనే విశ్వాసం భక్తుల్లో ఉందని ఆలయ అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్టీ, ఎస్సీ మెజిస్ట్రేట్ శ్రీనివాస్ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. అలాగే జంగారెడ్డిగూడెం మెజిస్ట్రేట్ కుమారి తేజస్విని పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం, శేషవస్త్రాలు, ప్రసాదాలతో సత్కరించారు.

ఆలయ కార్యనిర్వహణ అధికారి కలగర శ్రీనివాస్ మాట్లాడుతూ సాయంత్రం స్వామివారిని శేషవాహనంపై తిరువీధి ఉత్సవంగా ఊరేగింపుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.