ఏలూరు, మే 10: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “ప్రజల చెంతకే పోలీస్” కార్యక్రమంలో భాగంగా చింతలపూడి మండలం యర్రంపల్లి గ్రామంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాధన్ గ్రామ ప్రజలతో మమేకమై పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ సుస్మిత మాట్లాడుతూ ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు చెప్పకూడదని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన ఏఎస్పీ, మహిళలు మరియు బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటి నిర్మూలనకు సమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఏఎస్పీ సూచించారు. పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా చూడాలని, మద్యం, సిగరెట్లు, గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉంచాలని హెచ్చరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలను వినియోగించుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రోత్సహించారు.
రోడ్డు భద్రతపై కూడా అవగాహన కల్పిస్తూ మైనర్లు వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
యువత తమ శక్తిని విద్య, క్రీడలు, ఉపాధి వంటి సానుకూల రంగాల్లో వినియోగించాలని ఏఎస్పీ పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతతో పలు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
“చదువే అత్యున్నత ఆయుధం.. వ్యసన రహిత సమాజమే మన లక్ష్యం” అని ఏఎస్పీ సుస్మిత యువతకు సందేశమిచ్చారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చింతలపూడి సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్ కుమార్, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

