Ticker

6/recent/ticker-posts

ఒక్క రోజే 100 మంది మృతి.. యూపీలో తుఫాను బీభత్సం..


ఉత్తర్ ప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌, మే, 14: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, తుఫాన్ అతలాకుతలం చేసింది. బుధవారం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ వర్ష బీభత్సానికి రాష్ట్రంలో 100 మంది మరణించారు. ఒక్క ప్రయాగ్‌రాజ్‌లోనే 21 మంది మృతి చెందారు.


భదోహిలో 18 మంది, మీర్జాపూర్‌లో 15 మంది, ఫతేపూర్‌లో 10 మంది, ఉన్నావ్, బదాయూన్‌లలో చెరో ఆరుగురు, ప్రతాప్‌గఢ్, బరేలీలలో చెరో నలుగురు, అలాగే సీతాపూర్, రాయ్‌బరేలి, చందౌలీలలో ఇద్దరు చొప్పున మరణించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. 24 గంటల్లో ఆర్థిక సాయాన్ని పంపణీ చేయాలని ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఐదారు జిల్లాల్లో హోరుగాలి, వర్షం బీభత్సం సృష్టించింది. హోర్డింగులు, రేకుల షెడ్లు కూలిపోయాయి. చాలా ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరియాయి.

థండర్ స్క్వాల్ అనేది సాధారణ వర్షం కాదు. ఇది చాలా వేగంతో కదిలే తుఫాను. భూమిపై ఉన్న వేడి గాలి, దానిపై ఉన్న చల్లగాలుల మధ్య ఏర్పడే ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల ఇది ఏర్పడుతుంది. ఈ రెండు గాలులు ఢీకొట్టడం వల్ల భారీ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతాయి. ఉరుములు, మెరుపులతో భారీ గాలుల వర్షం ఏర్పడుతుంది. గాలి వేగం గంటలకు 50-100 కి.మీ ఉంటుంది. మే నెలలో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల ఇలాంటి తుఫానులు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది.