ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గత కొంతకాలంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలకు అనూహ్యమైన ముగింపు లభించింది. ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని పూర్తిగా నిరంతరాయంగా తెరవనున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం గ్లోబల్ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా ముడి చమురు ధరలను ఒక్కసారిగా పాతాళానికి పడేసింది.
శాంతి దిశగా అడుగులు.. ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటన..
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఈ కీలక పరిణామాన్ని ధృవీకరించారు. ఇజ్రాయెల్ , లెబనాన్ మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. "శాంతియుత వాతావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాణిజ్య నౌకలన్నింటికీ హార్ముజ్ జలసంధి ద్వారా స్వేచ్ఛాయుత రాకపోకలను అనుమతిస్తున్నాం. ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నంత వరకు జలసంధి తెరిచే ఉంటుంది " అని అరాగ్చీ స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్వాగతించారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇది మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు పడ్డ ఒక బలమైన పునాది అని ఆయన అభిప్రాయపడ్డారు.
కుప్పకూలిన చమురు ధరలు:
మార్కెట్ లెక్కలు ఇలా... ఇరాన్ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఒకానొక దశలో యుద్ధం ముదిరితే బ్యారెల్ ధర $150 దాటుతుందని భయపడిన ఇన్వెస్టర్లు, తాజా నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ భారీ పతనం వల్ల ప్రపంచవ్యాప్తంగా రవాణా ఖర్చులు తగ్గి, ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
భారత్‌కు భారీ మేలు.. స్టాక్ మార్కెట్లలో జోరు!
ఈ పరిణామం భారతదేశం వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు వరంగా మారింది. భారత్ తన చమురు అవసరాలలో 80% పైగా దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. ముడి చమురు ధరలు తగ్గడం వల్ల భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడమే కాకుండా కరెంట్ అకౌంట్ లోటు అదుపులోకి వస్తుంది.దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సింగపూర్‌లోని గిఫ్ నిఫ్టీ ఒక్కసారిగా 300 పాయింట్లు పెరిగి 24,700 మార్కును దాటింది.
ఇది సోమవారం భారత మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమవుతాయని సూచిస్తోంది. హార్ముజ్ జలసంధిని తెరవడం అనేది కేవలం ఒక రవాణా మార్గాన్ని తెరవడం మాత్రమే కాదు.. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదుటపడటానికి సంకేతం. చమురు సరఫరాలో ఆటంకాలు తొలగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు స్థిరీకరించబడతాయని.. తద్వారా సామాన్యుడిపై భారం తగ్గుతుందని ఆశించవచ్చు. రాబోయే రోజుల్లో ఈ శాంతి వాతావరణం ఇలాగే కొనసాగితే, గ్లోబల్ ఎకానమీ మళ్లీ పట్టాలెక్కడం ఖాయం.

