Ticker

6/recent/ticker-posts

ఎడ్ల బండి కాన్వాయ్‌పై పెళ్లి కూతురు! గోదారోళ్లు ఏం చేసిన ట్రెండే! సోషల్ మీడియాలో వైరల్!


ఆంధ్రప్రదేశ్, అమలాపురం: గోదారోళ్ళు అనగా వినూత్నంగా ఆలోచించడమే కాదు దాన్ని ఆచరణలో పెట్టి ఔరా అనిపిస్తుంటారు. కొంతమంది నవాబులు కాలం నాటి ఖరీదైన  వింటేజ్ కార్లులో వధూవరులు ఊరేగితుంటే ఓ పెళ్లికూతురు మాత్రం పూర్వ పద్ధతిలో రెండెడ్ల బండిపై వివాహ వేదిక వద్దకు వచ్చి ఆకట్టుకుంది. 


ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా ఈ నవ వధువు పూర్వపు సాంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చింది. వినూత్న రీతిలో ఎడ్లబండిపై విహరిస్తూ కళ్యాణవేదికకు చేరుకుంది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఎ.వేమవరప్పాడు గ్రామంలో జరిగిందీ దృశ్యం. 

రావూరి అయ్యేశ్వరరావు, ప్రభావతి దంపతుల ఎకైక కుమార్తె భాగ్య సుష్మకు అంబాజీపేట మండలం కొర్లపాటి వారి పాలెం గ్రామానికి చెందిన పరసా బాలాజీరామ్, శ్రీదేవీ దంపతుల కుమారుడు మనోజ్‌కు వివాహం జరిగింది. ఈ వేడుక శనివారం రాత్రి అమలాపురంలోని సత్యనారాయణా గార్డెన్స్‌లో అంగరంగవైభంగా సాగింది.

ఈ సందర్భంగా పెళ్లి కుమార్తె పూర్వ సాంప్రదాయ పద్ధతిని అనుసరించింది. ఎడ్లబండిపై ఊరేగుతూ వివాహా వేదిక వద్దకు చేరుకుంది. ఎడ్లబండ్ల కాన్వాయ్‌లో వచ్చిన పెళ్లి కుమార్తెను అంతా ఆసక్తిగా చూశారు. ఆ సంస్కృతి స్థానికులను ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన దృశ్యాలను చూసేందుకు, ఫోన్లలో బంధించేందుకు పలువురు ఎగబడ్డారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.