Ticker

6/recent/ticker-posts

కదిరిలో ఇంట్లో పేలిన సిలిండర్ - నలుగురు మృతి, 12 మంది పరిస్థితి విషమం...


శ్రీసత్యసాయి: జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్, నిల్వ ఉంచి డిటోనేటర్లు పేలి నలుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడినవారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. 

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... శ్రీసత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ఘటనలో నలుగురు మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫోరెన్సిక్, క్లూస్ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అలాగే, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పేలుడు సంభవించిన ఇంట్లో క్వారీ పనుల కోసం ఉపయోగించే డిటోనేటర్లను అక్రమంగా నిల్వ ఉంచినట్లు తేలింది. ఈ పేలుడు ధాటికి ఆ ఇంటికి ఆనుకుని ఉన్న మరో నాలుగు ఇళ్లు కూడా దాదాపుగా నేలమట్టమయ్యాయి.

డిటోనేటర్లు పేలుడు తీవ్రతను భారీగా పెంచాయని చెబుతున్నారు. చుట్టుపక్కల ఇళ్లకు కూడా మంటలు వ్యాపించాయి. పేలుడు తీవ్రతకు మృతుల శరీరాలు ముక్కలై, మాంసపు ముద్దలుగా చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో వాటిని గుర్తించడం కూడా సాధ్యం కాలేదు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే గాయపడినవారిలో 12 మంది విషమంగా ఉందని సమాచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.