ఆంధ్రప్రదేశ్ అమరావతి: రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. ఆ జిల్లాలకు ప్రస్తుతం కలెక్టర్లుగా ఉన్న అధికారులను బదిలీ చేశారు. కొందరికి పదోన్నతులు కల్పించి కొత్త పోస్టుల్లో నియమించారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని సీఎస్ వెల్లడించారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ ను బదలి చేసి, ఆయన స్థానంలో విశాఖ కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ను నియమించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గా ముట్టింబాకు అభిషిక్త్ కిషోర్ ను నియమించారు. ఇక గుంటూరు జిల్లా కలెక్టర్ గా సమర్థంగా పనిచేస్తు ప్రభుత్వ అభినందనలు అందుకున్న తమీమ్ అన్సారియాను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరుగా నియమించారు. గుంటూరు కలెక్టర్ గా సి.ఎం. సాయికాంత్ వర్మ ను నియమించారు.
ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరుగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతికి పదోన్నతి కల్పించారు. ఇక ప్రస్తుతం కలెక్టర్లుగా ఉన్న సగిలి షాన్ మోహన్ ను ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (APEDB) సీఈఓగా నియమించారు. అదేవిధంగా అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ను ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి స్థానంలో ప్రస్తుతం ఎవరినీ నియమించలేదు. కొత్తవారిని నియమించే వరకు ఆ జిల్లా కలెక్టర్ కే జేసీగా ఎఫ్.ఎ.సి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశించింది.
ప్రభుత్వం చేపట్టిన తాజా బదిలీలు విస్తృత చర్చకు దారితీశాయి. ముఖ్యమైన జిల్లాలకు కలెక్టర్లను మార్చడం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా విశాఖ, గుంటూరు కలెక్టర్లను మార్చడమే చర్చకు కారణమవుతోంది. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న విశాఖకు హదీంద్ర ప్రసాద్ కలెక్టరుగా ఉన్నారు. ఆయనను మార్చి వేరొకరికి బాధ్యతలు అప్పగించడం వెనుక పరిపాలన కారణాలు ఉన్నాయా? లేక వేరే అంశాలు ఏమైనా ఉన్నాయా? అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు గుంటూరు కలెక్టరుగా రాజధాని ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న తమీమ్ అన్సారియాను తప్పించారు. అయితే ఆమెకు అంతకంటే కీలకమైన బాధ్యత అప్పగంచడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.

