ఆంధ్రప్రదేశ్ అమరావతి: రాజధాని అమరావతిలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాజధానిలో నిఘా పెంచాలని ప్రభుత్వం భావించింది. దీంతో సీఆర్డీఏ వ్యాప్తంగా కొత్తగా చెక్ పోస్టులు ప్రారంభించాలని పోలీసుశాఖ నిర్ణయించింది. అదేవిధంగా డ్రోన్ నిఘా, పోలీస్ పెట్రోలింగ్ పెంచేలా పోలీసు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 23న రాజధాని పరిధిలోని రాయపూడి గ్రామం వద్ద మేఘా ఇంజనీరింగ్ సంస్థ గిడ్డంగిలో పైపులు దహనమైన విషయం తెలిసిందే. దీంతో రాజధానిలో భద్రతను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాజధానిలో భద్రతా చర్యల్లో భాగంగా ఇక నుంచి కొత్తగా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఇకపై రాజధానిలోకి వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తామని తెలిపారు. సరైన కారణం ఉంటేనే వాహనాలను అమరావతిలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా రాత్రి వేళల్లో డ్రోన్ నిఘా ఉంటుందని, విద్రోహ చర్యలకు ఆస్కారం లేకుండా పోలీసు నిఘా పెంచుతున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఇది ఎలా సాధ్యమైందంటే? ఈ నెల 23న మేఘా ఇంజనీరింగ్ కు చెందిన పైపులను దహనం చేసిన కేసులో నిందితుడు రామును అరెస్టు చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును స్వల్ప కాలంలోనే ఛేదించారు. దీంతో పోలీసుశాఖ ప్రతిష్ట పెంచారని సిబ్బందిని ఎస్పీ అభినందిస్తూ తుళ్లూరు పోలీసు స్టేషన్ లో వారికి సత్కరించారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతంలో నిఘా చర్యలు పెంచుతున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.
ఇప్పటివరకు రాజధానిలో చెక్ పోస్టులు లేవు. కేవలం వీఐపీ మూమెంట్ ఉన్న సమయంలోనే తనిఖీలు చేపట్టేవారు. ఇక నుంచి తనిఖీలు నిరంతరం కొనసాగేలా ప్రభుత్వం తీసుకుంది. ఈ నెలలో రెండు సార్లు పైపులు తగలపడిపోయాయి. ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన రూ.10 కోట్ల విలువైన పైపులు ఈ నెల 11న కాలిపోగా, 23న మేఘా ఇంజనీరింగ్ సంస్థ పైపులు దహనమయ్యాయి. ఇందులో విద్రోహ చర్య ఉందని ప్రభుత్వం అనుమానించి విచారణకు ఆదేశించింది. ఈ రెండు ఘటనల్లో ఒకదానికి సెక్యూరిటీ గార్డు రాము కారణమని పోలీసులు తేల్చారు. అతడిని అరెస్టు చేశారు. ఈ పరిణామం నేపథ్యంలో రాజధానిలో నిఘా పెంచాలని ప్రభుత్వం పోలీసు శాఖను ఆదేశించింది.

