TELANGAN: తెలంగాణలోని రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యాసంగి పంట సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధుల విడుదలపై ప్రకటన చేసింది. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు విడుదల చేయనున్నట్టుగా వెల్లడించింది. యాసంగి రైతు భరోసా నిధులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రోజున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో మొత్తంగా రూ. 9 వేల కోట్లను జమ చేయనుంది. ఎకరానికి రూ. 6 వేల చొప్పున రైతుల బ్యాంక్ అకౌంట్‌లలోకి డబ్బులను విడుదల చేయనుంది.
ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌పామ్ కర్మాగారం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగే సభ వేదికగా రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. అయితే రైతు భరోసా నిధులను మూడు విడతల్లో రైతు ఖాతాల్లో జమ చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 22న ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్టుగా తెలిపింది. ఇందుకోసం రూ. 3,590 కోట్లు నిధులను 70 లక్షల మంది రైతుల ఖాతాలకు బదిలీ చేయనున్నట్టుగా పేర్కొంది.
రెండో విడతకు సంబంధించి.. ఆ తర్వాత మరో 20 రోజులకు రూ. 2,650 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక, మూడో విడతలో ఏప్రిల్ నెలాఖరులోగా మిగిలిన రైతులకు కూడా రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లోకి బదిలీ చేయనున్నట్టుగా వెల్లడించింది. మొత్తంగా 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ. 9 వేల కోట్లు రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నట్టుగా తెలిపింది.



.jpeg)