Ticker

6/recent/ticker-posts

పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణలో సీఎం చంద్రబాబు నాయుడు


ANDRAPRADESH: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోగలిగినప్పుడే అమరజీవి పొట్టి శ్రీరాములుకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములు స్పూర్తిని నిరంతరం గుర్తుపెట్టుకుని రాష్ట్రాభివృద్ధి కోసం పని చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగానే అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం ఏర్పాటైందని.. అమరజీవి త్యాగానికి గుర్తుగా ఆయన విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ పేరు సముచితమని సీఎం అభిప్రాయపడ్డారు. 


సోమవారం అమరావతిలోని శాఖమూరు పార్కులో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. అమరావతిలో తొలి భారీ శిల్పంగా పొట్టి శ్రీరాములు విగ్రహం నిలుస్తుంది. 

శాఖమూరు పార్కులోని 6.80 ఎకరాల్లో అమరజీవి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 6 నెలల రికార్డు కాలంలోనే ప్రాజెక్ట్ మొదటి దశ పనులను ట్రస్ట్ పూర్తి చేసింది. ఈ భారీ విగ్రహానికి 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ వినియోగించారు. రెండో దశలో మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

స్పూర్తికి మారు పేరు పొట్టి శ్రీరాములు
‘స్పూర్తికి మారు పేరు పొట్టి శ్రీరాములు. ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు.. అందరివాడు. 58 రోజుల నిరాహారదీక్షకు చిహ్నంగా 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు భారీ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ అని పేరు పెట్టారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉంది.. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉంది... ఇప్పుడు ఏపీలో స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ ఉంది’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్కును ఆరు నెలల్లో మొదటి దశ పనులు పూర్తి చేశారు. 

పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి... ఆయన్ను స్పూర్తిగా తీసుకోవాలి. తెలుగువారికి గుర్తింపు కూడా లేని రోజుల్లో తెలుగు వారి సత్తా చాటిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. మహాత్మా గాంధీ అహింసా సిద్దాంతంలో స్వాతంత్య్రం తెచ్చారు... పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసి రాష్ట్రాన్ని సాధించి పెట్టారు. ప్రాణాలను లెక్క చేయకుండా తెలుగు వారికి రాష్ట్రం కోసం పోరాడారు’సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.‘పొట్టి శ్రీరాములు త్యాగం తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కేంద్రం నాందీ పలికింది. 

ఐదు దశాబ్దాల్లో అనునిత్యం అనేక విషయాల్లో పొట్టి శ్రీరాములు పొరాడారు. భార్య పిల్లలు చనిపోయిన తర్వాత ఆ బాధను దింగమింగి దేశ కోసం పోరాడారు. దళితుల ఆలయ ప్రవేశం కోసం పోరాడారు.. 29 రోజుల నిరాహార దీక్ష చేశారు. కనీసం నీళ్లు కూడా తాగకుండా 58 రోజుల దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేశారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని తెలుగు జాతి గుర్తు పెట్టుకోవాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.