ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. న్యాయసేవా అధికార సంస్థల ద్వారా మహిళలకు ఉచిత న్యాయసేవలు అందిస్తున్నామని, మహిళలకు ఎదురయ్యే వివిధ సమస్యల పరిష్కారానికి సంస్థలు సహకరిస్తున్నాయని పేర్కొన్నారు.
ఉద్యోగ, కార్మిక రంగాల్లో మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులపై పోష్ చట్టం (POSH Act) ద్వారా న్యాయం పొందవచ్చని వివరించారు. బాల్య వివాహాల కారణంగా మహిళలు అనేక మానసిక, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఎటువంటి న్యాయ సమస్యలు లేదా సందేహాలు ఉన్నా 15100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఉచితంగా సలహాలు పొందవచ్చని తెలిపారు.
మహిళా పోలీసు విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవిచంద్ర మాట్లాడుతూ, చట్టాలను సరైన విధంగా ఉపయోగించినప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. చట్టాలను దుర్వినియోగం చేయరాదని, మహిళా పోలీస్ స్టేషన్లు మహిళల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నాయని తెలిపారు. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం ఉత్తమమని సూచించారు.
జిల్లా ఐసిడిఎస్ పీడీ పి. శారద మాట్లాడుతూ, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. మహిళా సమస్యల పరిష్కారంలో న్యాయవ్యవస్థ, పోలీసు శాఖతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ఇన్‌చార్జ్ చైర్‌పర్సన్ పి. వెంకటేశ్వరరావు, మెడికల్ విభాగానికి చెందిన శ్రీమతి జ్యోతి, సీడీపీఓలు శ్రీమతి పద్మావతి, శ్రీమతి తులసి తదితరులు పాల్గొన్నారు.


.jpeg)
