ఏలూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాలని డీపీఎం బి. వెంకటేశ్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యవసాయ కార్యాలయంలోని IADP హాల్లో ఆదివారం 150 మంది రైతులు మరియు కేడర్లతో డీబ్రీఫింగ్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీపీఎం బి. వెంకటేశ్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయం అత్యంత అవసరమని పేర్కొన్నారు. బయో రిసోర్స్ సెంటర్ (BRC) యజమానులు సమర్థవంతంగా పనిచేసి రైతులకు సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు.
కషాయాలు, జీవ ఉత్ప్రేరకాలు మరియు వాటి వినియోగ విధానాలపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పిస్తే రసాయన ఎరువులు, మందుల వినియోగం క్రమంగా తగ్గుతుందని తెలిపారు. బీఆర్సీ దుకాణాలను బలోపేతం చేసి ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.
మట్టినమూనాల సేకరణ బాధ్యతాయుతంగా చేసి, వాటిని త్వరితగతిన పరీక్షా ప్రయోగశాలలకు పంపించాలని అధికారులకు ఆదేశించారు. PMDS (నవధాన్యాలు) పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు వాటి ఉపయోగాలు, అమలు విధానాలను రైతులకు వివరించాలని చెప్పారు. అలాగే URVI యాప్‌లో ప్రకృతి వ్యవసాయ రైతుల డేటా నమోదు ఖచ్చితంగా చేయాలని సూచించారు. కేడర్ల ఫీల్డ్ వెరిఫికేషన్ చెకింగ్లు నిర్వహించబడతాయని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాలు, ఆదాయ అవకాశాలను ఇతర రైతులకు వివరించి వారిని కూడా ఈ విధానంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో డీపీఎంయూ సిబ్బంది పాల్గొన్నారు.


.jpeg)
