Ticker

6/recent/ticker-posts

సహాయం పేరుతో మహిళపై అత్యాచారం.. యూట్యూబర్ మిథున్ చక్రవర్తి అరెస్ట్


జంగారెడ్డిగూడెం: 

జంగారెడ్డిగూడెం పట్టణంలో సహాయం పేరుతో మహిళపై అత్యాచారం చేసిన ఘటనలో యూట్యూబర్ కరుటూరి మిథున్ చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని అడిషనల్ ఎస్పీ సుస్మిత రాఘవన్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

సోమవారం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీతో పాటు సిఐ ఎంవి సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్ పాల్గొన్నారు.

అడిషనల్ ఎస్పీ వివరాల ప్రకారం, జంగారెడ్డిగూడెంకు చెందిన ఓ మహిళ తన కుటుంబ సమస్య పరిష్కారం కోసం ‘ఎంసి మీడియా’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న కరుటూరి మిథున్ చక్రవర్తిని సంప్రదించింది. ఈ క్రమంలో అతడు ఆమె వద్ద నుండి రూ.5,000 ఫోన్‌పే ద్వారా తీసుకున్నాడని తెలిపారు. శనివారం రాత్రి బాధితురాలు అతని కార్యాలయానికి వెళ్లగా ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయని చెప్పారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంటనే కేసు నమోదు చేసి ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అనంతరం ఆదివారం స్థానిక హైస్కూల్ సమీపంలో మిథున్ చక్రవర్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపినట్లు వెల్లడించారు.

మిథున్ చక్రవర్తిపై 2016 నుంచే పలు కేసులు ఉన్నాయని, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడని, ఈ కేసుతో అతని బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందని అడిషనల్ ఎస్పీ పేర్కొన్నారు.


ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేయొద్దు

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ సుస్మిత రాఘవన్ మాట్లాడుతూ, ఎవరైనా తమకు జరిగిన అన్యాయంపై భయపడకుండా ఎస్పీ కార్యాలయం లేదా సర్కిల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ బాధితుల పక్షాన ఉంటుందని, ఎవరూ వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.