తెలంగాణ: తెలంగాణ గోల్డ్ మ్యాన్‌గా పేరు గాంచిన హోప్ ఫౌండేషన్ ఛైర్మన్, తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు సంబంధించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు.. తదుపరి విచారణకు హాజరు కావాలని సూచించారు. ఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు కొండ విజయ్ కుమార్ గురువారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. అయితే ఆయన ఢిల్లీకి వెళ్లడానికి ముందే హైదరాబాద్‌లోని ఐటీ అధికారులు.. ఆయన వద్ద పాన్ కార్డు, ఇతర వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కొండ విజయ్ కుమార్ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే.. అక్కడ నలుగురు ఐటీ అధికారులు వేచి ఉన్నారు. వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్న ఐటీ అధికారులు విచారణ చేశారు. ఈ తనిఖీలు, విచారణకు కారణం కొండ విజయ్ కుమార్ తన ఒంటిపై ధరించిన నగలేనని తెలుస్తోంది. అయితే సుమారు 12 గంటల పాటు కొండ విజయ్ కుమార్‌ను ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే అధికారులు ప్రత్యేకంగా విచారణ జరపడం గమనార్హం. ఈ క్రమంలోనే విజయ్ కుమార్ ధరించిన కొన్ని కిలోల బంగారు ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ నగలు వాటికి సంబంధించిన కొనుగోలు రశీదులు, ఆదాయ వనరులపై ఐటీ అధికారులు విజయ్ కుమార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. గోల్డ్ మ్యాన్ పేరు మీద ఉన్న స్థిర, చర ఆస్తుల వివరాలు.. హోప్ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న ట్రాన్సాక్షన్లను ఐటీ అధికారులు ఆరా తీశారు. 12 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత.. హాకీ ఇండియా అవార్డుల కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతిని ఇచ్చారు. త్వరలోనే పూర్తిస్థాయి ఆధారాలతో మరోసారి విచారణకు హాజరు కావాలని ఆయనకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన కొండ విజయ్ కుమార్.. ఎప్పుడూ తన ఒంటిపై దాదాపు 5 కిలోల నుంచి 12 కిలోల వరకు బంగారు ఆభరణాలు ధరిస్తారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో గోల్డ్ మ్యాన్‌గా విజయ్ కుమార్ ఫేమస్ అయ్యారు. హోప్ ఫౌండేషన్ ద్వారా కొండ విజయ్ కుమార్ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఐటీ అధికారులు ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.

