ఏలూరు/కాకినాడ, SR TV NEWS, మార్చి 28: పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తామని ఉద్యోగం పక్కా అని ఆశ చూపించి విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు ఫీజు పేరుతో లూటీ చేస్తున్న కాకినాడ ఆదిత్య విద్యాసంస్థపై చర్యలు ఎక్కడా అని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివ కుమార్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఆదిత్య విద్యాసంస్థ విద్యార్థుల దగ్గిర నుంచి ప్రభుత్వ యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజు కన్నా రెట్టింపు ఫీజు వసూలు చేస్తూ.. విద్యార్థులను నిలువెల్లా దోచుకుంటుందని ఆరోపించారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో యూనివర్సిటీ నిర్ణయించిన అండర్ గ్రాడ్యుయేట్ ఫీజు రూ.8 వేల నుంచి రూ.14,500 వరకు ఉండగా ఆదిత్య విద్యాసంస్థలు మొదటి సంవత్సరం రూ.41 వేలు, రెండవ సంవత్సరం రూ.42 వేలు, మూడవ సంవత్సరం రూ.42 వేలు వసూలు చేయడమే కాకుండా అటెండెన్స్ పేరుతో 75 శాతం ఉండాలని నిబంధనను అడ్డం పెట్టుకుని, కాండేషన్ పేరుతో 75% తక్కువ ఉన్నవారికి ఉంటే రూ.500 రూపాయలు, 65 శాతం హాజరు ఉంటే వెయ్యి రూపాయలు వసూలు చేస్తూ.. లక్షలాది రూపాయలు విద్యార్థుల దగ్గర్నుంచి దోచుకుంటున్నారని ఆరోపించారు.
ల్యాబ్, రికార్డు ఫీజు, బస్సు ఆలస్యమై లేటుగా వచ్చినా బయట నుంచోపెట్టి మరీ ఫైన్ వసూలు చేయడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ కి కాండేషన్ కట్టాలంటే చలానా తీసి కట్టాలి కాకినాడ ఆదిత్య విద్యాసంస్థలు ఎటువంటి చలానా బిల్లు ఇవ్వకుండా వసూలు చేస్తున్నారని, ఏలూరులో కూడా అదేవిధంగా ఆదిత్య విద్య సంస్థ క్యాంపస్ డ్రైవ్ పేరుతో ప్రచార ఆర్భాటాలతో విద్యార్థులను మభ్యపెడుతూ కొంతమందికే తక్కువ ప్యాకేజీతో ఉద్యోగాలు అందించి డిగ్రీ పూర్తయ్యాక విద్యార్థులు ఎక్కడ ఉద్యోగం పొందాలో తెలియక సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అంతే కాకుండా క్రమశిక్షణ అంటూ రకరకాల అభియోగాలను విద్యార్థులపై నిందలు మోపుతూ చదువు కాలం మధ్యలో టిసీలు ఇచ్చి పంపిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల పలు విద్యార్థులు జీవితాలు అంధకారంగా మారుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి వైఖరితో విద్యార్థులు కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేవరకు భయంతో గడుపుతున్నారని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఏ సమయంలో ఈ నింద వేసి టిసి ఇచ్చి పంపించేస్తారనే భయం విద్యార్థుల్లో అడుగడుగునా ఉండిపోయిందని పలువురు విద్యార్థులు వినిపిస్తున్నారు..
నిబంధనలకు విరుద్ధంగా ఈ సంస్థ వ్యవహరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం, ఉన్నత విద్యాశాఖ అధికారులు దీనిపైన స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే కాకినాడ ఆదిత్య విద్యాసంస్థలపైన సమగ్ర దర్యాప్తు నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను ఐక్యం చేసి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధం అవుతామని ఏఐఎస్ఎఫ్, ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివ కుమార్ హెచ్చరించారు.

