హైదరాబాద్: హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో పాల్గొన్నవారిలో ఐదుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా వచ్చినట్టుగా పోలీసులు తొలుత తెలిపారు. అయితే తాజాగా టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు కూడా డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్దారణ అయిందని వెల్లడించారు. మొత్తంగా మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ కేసులో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్దారణ అయిందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్, రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌గా నిర్దారణ అయిందని వెల్లడించారు. ఫామ్‌హౌస్‌పై దాడి చేసిన తర్వాత నిన్న రాత్రి నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో ఎంపీ పుట్టా మహేష్‌కు నెగిటివ్ వచ్చిందని తెలిపారు. అయితే బ్లడ్ టెస్టులో పుట్టా మహేష్‌కు పాజిటివ్ వచ్చిందని చెప్పారు.
ఇందుకు సంబంధించిన వివరాలను ఈగల్ టీమ్ ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. మెయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గురించి పక్కా సమాచారం రావడంతో... ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని, స్థానిక పోలీసుల సమన్వయంతో దాడులు చేసినట్టుగా తెలిపారు. అయితే తాము ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించే సమయంలో కాల్పుల శబ్దం వినిపించిందని... దీంతో మరింత వేగంగా స్పందించామని చెప్పారు. నమిత్ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్టుగా గుర్తించామని తెలిపారు. దీంతో వెంటనే రివాల్వర్‌ను సీజ్ చేసి... అక్కడున్న 11 మందిని పక్కకు తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. డ్రగ్స్ కిట్‌తో టెస్టులు చేయగా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్దారణ అయిందని చెప్పారు.
అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి అందరి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించి తదుపరి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఈ క్రమంలోనే ముందుగా నిర్దారణ అయిన ఐదుగురితో (రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి) పాటు మరొకరికి (పుట్టా మహేష్ కుమార్) కూడా పాజిటివ్‌గా నిర్దారణ అయిందని చెప్పారు. అనంతరం తదుపరి దర్యాప్తు కోసం ఈ 11 మందిని మెయినాబాద్ పోలీసులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. వారు తదుపరి న్యాయ ప్రక్రియ చేపడతారని చెప్పారు.
కాల్పుల ఘటనపై కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. నమిత్ శర్మ కాల్పులు జరిపినట్టుగా ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. అయితే పార్టీలో డ్రగ్స్ ప్రభావంతో జోష్‌లో ఉన్న సమయంలో నమిత్ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోందని అన్నారు. కాల్పలు జరిపిన సమయంలో అక్కడ పోలీసులు లేరని... చాలా దూరంలో ఉన్నారని తెలిపారు. పోలీసులపై ఎలాంటి కాల్పులు జరగలేదని వెల్లడించారు. కాల్పులు జరిపిన సమయంలో వారికి పోలీసులు వచ్చారనే విషయం కూడా తెలిసి ఉండదని అన్నారు.
ఈ పార్టీలో పాల్గొన్న వ్యక్తులు ఒకరికొకరు పరిచయం ఉన్న వ్యక్తులేనని చెప్పారు. అది రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్ అని తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎల్ పరీక్షలో పట్టుబడిన డ్రగ్స్ ఏమిటనేది స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు?, గతంలో వీరు డ్రగ్స్ తీసుకున్నారా? అనే వివరాలపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వివరాలను మాత్రం వెల్లడించామని... తదుపరి దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని చెప్పారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.



.jpeg)