కైకలూరు: అంగన్వాడీల ఉద్యమంపై రాష్ట్ర ప్రభుత్వ ధమరకాండకు, విజయవాడలో అక్రమ అరెస్టులకు నిరసనగా సిఐటియు, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కైకలూరులో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తాలూకా ఆఫీస్ సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు. మెయిన్ రోడ్డు గుండా భారీ ర్యాలీ నిర్వహించారు.
అక్రమంగా అరెస్టు చేసిన అంగన్వాడీలను విడుదల చేయాలని, జీతాలు పెంచాలని, సమస్యల పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జక్కుల మహేష్,అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కైకలూరు ప్రాజెక్టు అధ్యక్షురాలు ఆండ్రు చల్లమ్మ, కార్యదర్శి పోలవరపు సుజాత మాట్లాడుతూ అంగన్వాడీలు జీతాలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు.
30% ఎమ్మెల్యేల జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీలను విజయవాడ ధర్నా చౌక్ లో అత్యంత దుర్మార్గంగా అర్ధరాత్రి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టులు చేయడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు తరలించి ఇబ్బందులకు గురి చేయడం, మహిళలని చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు జీతాలు పెంచాలని, ఇతర సమస్యల పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు కమిటీ కోశాధికారి మీనా కుమారి, సహాయ కార్యదర్శి ఎస్.కె అబీద, జి విజయలక్ష్మి, పి. లక్ష్మి, జి ఝాన్సీ రాణి, బి.సత్యవతి, రమాదేవి, మేనకా లక్ష్మి, మణి తదితరులు పాల్గొన్నారు.

