Ticker

6/recent/ticker-posts

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్‌డేట్...


ANDRAPRADESH: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిగ్ అప్‌డేట్ వెలువడింది. రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో ఎజెండాలో పేర్కొన్న అంశాలపై చర్చ అనంతరం... మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్తావించారు. రాబోయే ఆరు నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రులతో అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయ పరంపరను కొనసాగించాలని కోరారు.


ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధించిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇదే జోరు కొనసాగాలని మంత్రులకు సూచించారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించేలా ఇన్‌ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని తెలిపారు. ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కూడా చెప్పారు.

భూగర్భజల స్థాయిలను మెరుగుపరచడానికి చేపట్టాల్సిన చర్యలను సీఎం చంద్రబాబు ప్రకటించారు. భూగర్భజలాల పెంపుదలకు ఏప్రిల్ 1 నుంచి 90 రోజుల 'జలధార' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. మే 15 నుంచి కాలువల్లోకి నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పటిలోగా కాల్వలు, డ్రెయిన్లను శుభ్రం చేయించాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హాయంలో నిర్లక్ష్యానికి గురైన ఎత్తిపోతల పథకాలను తిరిగి గాడిలో పెట్టాలని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సుమారు 7 లక్షల ఎకరాలకు నీరు అందలేదన్నారు. చివరి ఎకరాకూ నీరు చేరాలన్న లక్ష్యంతో పనిచేయాలని మంత్రులను కోరారు.