ఏలూరు, ఫిబ్రవరి 28: ఆపత్కాలంలో దాతలు, స్వచ్ఛంద సంస్థలు అందించే సేవలు అమూల్యమని, ఈ విషయంలో రెడ్‌క్రాస్ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మరియు టిడిపి జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. పేదలకు అవసరమైన వైద్యసేవలను మరింత విస్తృతం చేయడానికి దాతల సహకారం ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని జిల్లా రెడ్‌క్రాస్ భవనంపై రెండో అంతస్తు నిర్మాణానికి శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ.60 లక్షల విరాళంతో నిర్మించనున్న రెడ్‌క్రాస్ భవన రెండో అంతస్తు నిర్మాణానికి వారు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ మరియు డయగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు బాధితులకు సరైన మార్గదర్శకం అవసరమని, రెడ్‌క్రాస్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్వీ ప్రసాద్ ఆధ్వర్యంలో సంస్థ మంచి సేవలు అందిస్తోందని అభినందించారు. ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన ల్యాబ్ ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే గుండె సంబంధిత వ్యాధులకు కూడా రెడ్‌క్రాస్ ద్వారా సేవలు అందించాలని సూచించారు.
ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా వంటి వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడం అవసరమని తెలిపారు. రెడ్‌క్రాస్ అందించే సేవలపై కరపత్రాలు ముద్రించి ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. ఎన్టీఆర్ వైద్యసేవలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
రెడ్‌క్రాస్ భవన రెండో అంతస్తు నిర్మాణానికి రూ.60 లక్షల విరాళం అందించిన గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తా సేవలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సంస్థకు రూ.2 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఎఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్ధసారధి, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తా, మోటేపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


.jpeg)
