Ticker

6/recent/ticker-posts

వేసవిలోనూ రెండు పూటలు త్రాగునీరు లక్ష్యం.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనుల పరిశీలన


ఏలూరు, ఫిబ్రవరి 28: నగర ప్రజలకు వేసవికాలంలో కూడా రెండు పూటలు త్రాగునీరు అందించడమే లక్ష్యంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కో-ఆప్షన్ సభ్యులు ఎస్‌.ఎం.ఆర్ పెదబాబు తెలిపారు.


శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మరియు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబా ఆదేశాల మేరకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను ప్రతిరోజూ ఎలక్ట్రికల్ డి.ఈ నారాయణరావు, ఏ.ఈ పవన్, సాయి లతో కలిసి పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

శనివారం ఉదయం దెందులూరు సమీపంలోని గోదావరి కాలువ వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించిన ఆయన, యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న బండ్ నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరి కాలువలో ప్రస్తుతం మూడు అడుగుల మేర నీటిమట్టం ప్రవహిస్తుండటంతో మోటార్ల ద్వారా నీటిని సక్రమంగా పంపింగ్ చేయగలుగుతున్నామని తెలిపారు.

ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ మరియు మోటార్ల నిర్వహణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ఎమ్మెల్యే చంటి మరియు మేయర్ నూర్జహాన్ ఆదేశాలతో జరుగుతున్న పర్యవేక్షణ వల్ల నగర ప్రజలకు త్రాగునీటి సరఫరా ఇబ్బంది లేకుండా కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

నగర ప్రజలు త్రాగునీటిని వృథా చేయకుండా అవసరానికి తగ్గట్టు వినియోగించాలని ఎస్‌.ఎం.ఆర్ పెదబాబు కోరారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, పాము శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.