Ticker

6/recent/ticker-posts

పోలీస్ సేవలు చిరస్మరణీయం – పదవీ విరమణ పొందిన అధికారులకు ఘన వీడ్కోలు


ఏలూరు, ఫిబ్రవరి 28: సుదీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో, అంకితభావంతో పోలీస్ శాఖకు సేవలందించి పదవీ విరమణ పొందిన ముగ్గురు అధికారులకు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై పదవీ విరమణ పొందిన అధికారులను సత్కరించి వారి సేవలను కొనియాడారు.


పదవీ విరమణ పొందిన అధికారుల్లో పి.ఎస్.వి.ఎన్. కుమార్ (ఎస్‌ఐ – మహిళా పోలీస్ స్టేషన్), ఎ. బాబు రాజేంద్ర ప్రసాద్ (ఏఆర్‌ఎస్‌ఐ – 804), ఎస్. రాంబాబు (ఏఆర్‌హెచ్‌సి – 233) ఉన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ పొందుతున్న అధికారులు సుమారు 40 సంవత్సరాల పాటు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ఎటువంటి మచ్చ లేకుండా సేవలందించడం అభినందనీయమన్నారు. పోలీస్ విధి నిర్వహణలో కుటుంబ జీవితాన్ని పక్కనపెట్టి ప్రజా సేవకు అంకితమైన వారి త్యాగం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. అధికారులను ప్రోత్సహిస్తూ నిలబడ్డ కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

పదవీ విరమణ అనంతరం కూడా వారు పోలీస్ కుటుంబంలో సభ్యులుగానే ఉంటారని, అవసరమైన సమయంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఎస్పీ హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవితం గడపడంతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. పదవీ విరమణ విధి నుండి విశ్రాంతి మాత్రమే కానీ బాధ్యతల నుండి కాదు అని, సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలిపారు.

అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్యచంద్రరావు మాట్లాడుతూ అధికారుల 40 ఏళ్ల నిజాయితీ సేవ యువ పోలీస్ సిబ్బందికి ఆదర్శమన్నారు. పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఆర్. నాగేశ్వరరావు అధికారులు అందించిన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన అధికారులను ఎస్పీ శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అధికారులు మాట్లాడుతూ ఈ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని జీవితాంతం మరువలేమని ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ జి. మునిరాజా, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్‌ఐ పవన్ కుమార్, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.