ANDRAPRADESH, MOVIES NEWS: మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న చిత్రం "మన శంకర వరప్రసాద్ గారు". పండుగకి వస్తున్నారు అనేది ట్యాగ్ లైన్. చిరు కెరీర్‌లో 157వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలానే లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. కేథరిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. భీమ్స్ సిసిరీలియో సంగీతం సమకూరుస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమోలు, పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. వింటేజ్ చిరంజీవిని మళ్లీ చూస్తారంటూ చెబుతున్న అనిల్.. మళ్లీ తనకు బాగా కలిసొచ్చిన ఫన్, మాస్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిపి పక్కా ఎంటర్ టైనర్ లాగా ప్రేక్షకుల ముందుకు ఈ మూవీని తీసుకురాబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా అనిల్ ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ సాధించాయి. దాంతో వీరి కాంబినేషన్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.
ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది. స్పెషల్ ప్రీమియర్‌తో పాటు, టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 11న స్పెషల్ ప్రీమియర్‌కు అనుమతి ఇవ్వగా.. ఆ షో టికెట్ ధరను రూ.500గా (జీఎస్టీతో కలిపి) నిర్ణయించింది. రాత్రి 8గంటల నుంచి 10 గంటల మధ్య షోను ప్రదర్శించాలని స్పష్టం చేసింది. ఇక జనవరి 12వ తేదీ నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి) మల్టీప్లెక్స్‌లలో రూ.125 (జీఎస్టీతో కలిపి) టికెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించింది.
ఆయా తేదీల్లో రోజుకు 5 షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. మరోవైపు మెగాస్టార్ తన 158వ సినిమాను దర్శకుడు బాబీతో కమిట్ అయ్యారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన "వాల్తేరు వీరయ్య" బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌లో రక్తంతో తడిసిన గొడ్డలి, రక్తం చిందిన బ్యాక్‌డ్రాప్ తో చూపించారు. ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుండగా.. చిరంజీవి తండ్రి పాత్రలో కనిపిస్తారనే టాక్ ఉంది. అయితే కథలో మార్పులు చేస్తూ సినిమాను కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారని సమాచారం


.jpeg)
