హైదరాబాద్: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తన రాజకీయ భవిష్యత్ మొదలు.. జగన్‌తో తన ప్రయాణం, లిక్కర్ స్కామ్, ఆర్థిక లావాదేవీలు సహా అనేక అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డిని ఈడీ విచారించింది. ఈ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. పలు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఈడీ విచారణ గురించి..
లిక్కర్ స్కామ్ కేసులో గురువారం నాడు విజయసాయిరెడ్డిని ఈడీ విచారించింది. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు తనను అడిగిన ప్రశ్నల గురించి తెలిపారు. మొదటగా లిక్కర్ స్కామ్ జరిగిందా? లేదా? అని అడిగారని.. తనకు తెలియదని చెప్పానన్నారు. మీరు నెంబర్ 2 స్థానంలో ఉండి తెలియదు అనడం కరెక్టేనా అని అడిగారని.. జగన్ ఉన్నపుడు నెంబర్ 2 అనే ప్రసక్తే ఉండదని చెప్పానన్నారు. లిక్కర్ స్కామ్ గురించి తనకు తెలియదని.. తన దృష్టిలో లిక్కర్ స్కామ్ లేదన్నారు విజయసాయి. స్కామ్‌లో పాల్గొన్నవారినే ఈ ప్రశ్న అడగాలని ఈడీ అధికారులకు చెప్పానన్నారు. ఈడీ అధికారులు తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారని.. తనకు సంబంధం లేని కేసుల్లో తనను ఇరికించారని ఆరోపించారాయన. భవిష్యత్‌లో మరోసారి తనను పిలుస్తారని అనుకుంటున్నట్లు విజయసాయి చెప్పారు.
స్కామ్ గురించి..
‘సజ్జల శ్రీధర్, రాజ్ కసిరెడ్డి, మిథున్‌రెడ్డి మధ్య లావాదేవీలు జరిగాయి. లిక్కర్ స్కాం గురించి రాజ్ కసిరెడ్డికే తెలుసని ఈడీ అధికారులకు చెప్పాను. మిథున్‌రెడ్డి కోరిక మేరకే రాజ్ కసిరెడ్డి మీటింగ్ ఏర్పాటు చేశాను. మిథున్‌రెడ్డి సూచన మేరకే అరబిందో నుంచి డబ్బు ఇప్పించాను. నేను ఎట్టిపరిస్థితుల్లోనూ అప్రూవర్‌గా మారను. ఏ శక్తీ నన్ను అప్రూవర్‌గా మార్చలేదు. నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవు కాబట్టే అరెస్టు చేయలేదు. లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర లేదు’ అని విజయసాయిరెడ్డి వివరించారు.
జగన్ నుంచి దూరమవటానికి కారణమిదే..
‘జగన్ కోటరీలో నేను నెంబర్ 2 అని ప్రచారం చేశారు.. కేసుల విషయంలో మాత్రమే నేను నెంబర్ 2గా ఉంటాను. కానీ, లాభాల విషయంలో నేను ఉండను. అధికారంలోకి వచ్చే వరకు సంవత్సరం పాటు వైఎస్ జగన్ నాకు నెంబర్ 2 స్థానం ఇచ్చారు. జగన్ హృదయంలో కూడా నెంబర్ 2 ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక నేను దూరం అయ్యాను. 2020 నుంచి నన్ను సైడ్ చేశారు. వెన్నుపోటు పొడుస్తానని అనుమానం కలిగించి.. కుట్రలు చేసి కోటరీ మనుషులు నన్ను జగన్‌కు దూరం చేశారు. జగన్ హృదయంలో లేను కాబట్టి.. కోటరీ వేధింపులు తట్టుకోలేక పార్టీ నుండి బయటికి వచ్చాను’ అని విజయిసాయి స్పష్టం చేశారు.
జగన్ అధికారంలోకి రాలేరు..
‘కూటమి ఇలాగే కొనసాగితే జగన్ అధికారంలోకి రాలేరు. కూటమిని విడగొడితేనే జగన్ అధికారంలోకి వస్తారు. కూటమిని విడగొట్టాలని.. ఇప్పుడున్న కోటరీకి లేదు. జగన్ కోటరీ ఆయనను తప్పుదారి పట్టిస్తోంది. కోటరీ ఉన్నంతవరకు జగన్ అధికారంలోకి రావడం కష్టం. కోటరీని నమ్మి.. జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా ఉపయోగం లేదు. జగన్ మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటాననుకున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. జగన్‌కు ఒక పాలేరులా పనిచేశా.
నేను ఇప్పటివరకు జగన్‌ను విమర్శించలేదు. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నేను డబ్బుకు లోంగలేదు.. ఎప్పటికి లొంగను.. నా మీద జగన్ చేసిన ఆ వాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలి. జగన్ కోసం నేను శ్రమపడి సంపాదిస్తే.. కోటరీలో ఉన్నవాళ్లు పందికొక్కుల్లా తింటున్నారు. ఆ పందికొక్కులు ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. కోటరీ పొగబెట్టి నన్ను పంపించేసేలా చేసింది. కోటరీ మాటలను జగన్ నమ్మారు. అవమానాలు తట్టుకోలేకే వైసీపీని వీడాను.’ అని చెప్పుకొచ్చారు మాజీ ఎంపీ.
రాజకీయాల్లోకి రీఎంట్రీ..
‘నేను రాజకీయాల నుంచి విరమించుకోలేదు. ఈనెల 25 తర్వాత మళ్లీ రాజకీయరంగ ప్రవేశం చేస్తా. ఏ రాజకీయ పార్టీలో చేరతారు అని అడుగుతున్నారు.. నేను ఏ పార్టీలో చేరను.. నా రాజకీయ భవిష్యత్తును నేనే చెప్తాను. నాకు బీజేపీ నుంచి ఆహ్వానం రాలేదు. బీజేపీలో చేరతానని నేను అనలేదు. ఆహ్వానం అందితే ఆలోచిస్తా. ముందే ఊహాగానాలు ఎందుకు?’ అని తన రాజకీయ భవిష్యత్ గురించి క్లారిటీ ఇచ్చారు విజయసాయి రెడ్డి.
జగన్ పిలిస్తే ఆలోచిస్తా..
వైసీపీలోకి మళ్లీ వెళతారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. విజయసాయి రెడ్డి ఆసక్తికర కామెంట్ ఇచ్చారు. జగన్ మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తే ఆలోచిస్తానని అన్నారు.


.jpeg)
