Ticker

6/recent/ticker-posts

కాపులకు సీఎం పదవి, దళితులకు డిప్యూటీ సీఎం పదవి.. IPS అధికారి పీవీ సునీల్ కుమార్


ANDRAPRADESH: కాపులు, దళితులు ఏకమైతే అధికారం తమదేనని సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తావిస్తూ, కాపులు దళితులతో కలిస్తే బలం రెట్టింపు అవుతుందని, ముఖ్యమంత్రి పదవికి కాపు నాయకుడిని, ఉప ముఖ్యమంత్రి పదవులకు దళిత నాయకులను ప్రతిపాదించారు. అందరినీ కలుపుకొని పోవాలని, తమ నిధులు, పంచాయతీలు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్.


కాపులు, దళితులు కలిస్తే అధికారం ఖాయమంటూ ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. సోషల్ మీడియాలో పీవీ సునీల్ కుమార్ వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. 'కాపు సోదరులు కూడా మాకు సహకరించండి. రాష్ట్రంలో ప్రధాన, బలమైన కులం, అత్యధిక జనాలు ఉన్న కులం కాపులు. అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం.. చాలా వరకు సక్సెస్ అయిన కులం. ఆ సోదరులు కూడా దళితులతో కలిస్తే బలం రెట్టింపు అవుతుంది. మనం అందర్ని కలుపుకుని పోయి.. మన ఎజెండా ఏంటో తెలియజేయండి' అంటూ పిలుపునిచ్చారు.

'మీరు దళితవాడ పంచాయతీకి మద్దుతుగా నిలిస్తే.. మేం మీకు మద్దతిస్తాం. మీ కాపు నాయకుడ్ని ముఖ్యమంత్రిని చేయండి.. మా దళిత నాయకుడ్ని ఉప ముఖ్యమంత్రిని చేయండి. మా హర్షకుమార్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయండి, మా జడ శ్రవణ్ కుమార్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయండి, మా విజయ్ కుమార్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయండి. నాకు ఎన్నికల్లో టికెట్ ఇస్తే వద్దన్నాను.. కాబట్టే ఆ హామీ నెరవేరింది' అంటూ పీవీ సునీల్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.

'రాష్ట్రంలో రెండేళ్లు కాదు ఐదేళ్లు ఒకరే సీఎంగా, డిప్యూటీ సీఎంగా ఉండాలి. మిగతా కులాలను కలుపుకోండి.. మేము మీకు సహకరిస్తాం.. మీతో పాటూ మేము ముందుకొస్తాం, మా నిధులు, మా పంచాయతీలను మాకు ఇవ్వండి, మహిళల్ని సర్పంచ్‌లు, వార్డు మెంబర్లను చేయండి' అంటూ పీవీ సునీల్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. ఐపీఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

పీవీ సునీల్ కుమార్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. రఘురామ కస్టడీ వ్యవహారంలో హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర సెక్షన్ల కింద సునీల్‌కుమార్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆయన ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరయ్యారు. తనపై నమోదైంది తప్పుడు కేసని సోషల్ మీడియాలో స్పందించారు. ఈ కేసులో సునీల్ కుమార్ ఏ1గా ఉన్నారు. అయితే తాజాగా డిసెంబర్ 4న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.