మరికొందరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభం
తమిళనాడులోని శివకాశిలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఉదయం ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
దేశవ్యాప్తంగా టపాసుల తయారీకి కేంద్రంగా ఉన్న శివకాశిలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో కార్మికులు విధుల్లో నిమగ్నమై ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ఫ్యాక్టరీ ప్రాంగణంలో దట్టమైన పొగ, మంటలు అలుముకున్నాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే నలుగురు కార్మికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మరికొందరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతానికి ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ లేదా రసాయనాల మిశ్రమంలో జరిగిన పొరపాటు వల్ల పేలుడు జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. శివకాశిలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Social Plugin