Ticker

6/recent/ticker-posts

నెక్స్ట్ నా ప్రభుత్వమే.. గుర్తుంచుకోవాలన్న జగన్..!


ANDHRAPRADESH:ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ తీవ్ర ఉద్రిక్తతల మధ్యే చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న తోతాపురి మామిడి రైతులని పరామర్శించారు. జగన్ టూర్ సందర్భంగా పోలీసులు భారీగా ఆంక్షలు విధించినా.. వాటిని లెక్కచేయకుండా జనం కూడా అంతే భారీగా తరలివచ్చారు. దీంతో వారిని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేసిన పరిస్దితి కనిపించింది. ఈ నేపథ్యంలో రైతుల్ని పరామర్శించిన జగన్ .. చంద్రబాబు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

ఇవాళ బంగారుపాళ్యం మార్కెట్‌యార్డును సందర్శించిన జగన్.. మామిడి రైతులను కలిసి, వారి సమస్యలు ఆరా తీశారు. మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించారని జగన్ ఆరోపించారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. జగన్‌ వస్తున్నాడని తెలిసి, ఇక్కడ 2 వేల మంది పోలీసులను మొహరించి, రైతులను రానీయకుండా అడ్డుకున్నారన్నారు. రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారని, చివరకు టూవీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారన్నారు. ఇక్కడికి కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎందుకు అన్నారని, ఎందుకీ ఆంక్షలని ప్రశ్నించారు. అయినా ఇక్కడికి వేల మంది రైతులు వచ్చి, వారి ఆవేదన చెప్పుకున్నారని జగన్ తెలిపారు.

వరికి కూడా ధర లేదని,కనీసం రూ.300కు తక్కువకు అమ్ముకుంటున్నారని, పెసర, జొన్న, చివరకు మామిడి రైతులకు కూడా కనీస గిట్టుబాటు ధర రావడం లేదని జగన్ ఆరోపించారు. ఒక్క మన రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో అయినా కిలో మామిడి రూ.2కి దొరుకుతుందా అని ప్రశ్నించారు. ఎందుకు ధర లేదని ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. ఇదే మామిడికి మా ప్రభుత్వ హయాంలో కిలో రూ.22 నుంచి రూ.29 వరకు అమ్ముకున్నారని గుర్తుచేసారు. 

ఏటా మామిడి కొనుగోలు ఉంటుందని, దాన్ని మే మొదటి వారంలో మొదలుపెట్టాలని, కానీ, ఆ పని ఎందుకు చేయలేదని జగన్ ప్రశ్నించారు. జూన్‌ రెండో వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో.. మొత్తం పంట మార్కెట్‌ను ముంచెత్తిందని, దీంతో కంపెనీలు ధరలు తగ్గించాయని ఆరోపించారు. దీంతో మామిడి రైతులకు దిక్కు తోచడం లేదన్నారు. చిత్తూరు జిల్లాలో 52 పల్ప్‌ కంపెనీలు ఉన్నాయి, కానీ రైతులకు ధర రావడం లేదన్నారు. కంపెనీలు మామిడి కిలోకు రూ.8 ఇస్తుంటే, ప్రభుత్వం మరో రూ.4 చొప్పున ఇస్తోందని చెబుతున్నారని, మరి ఇక్కడ ఆ ధరకు ఎంత పంట అమ్ముడుపోయిందని అడిగారు. అదే పొరుగున్న ఉన్న కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే.. కిలో మామిడి రూ.16 చొప్పున కొన్నారన్నారు.

వైసీపీ హయాంలో కిలో మామిడి రూ.29 కి కొంటే, ఇప్పుడు కనీసం రూ.12 కూడా రావడం లేదన్నారు. ఇంకా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అందడం లేదని,నాడు ఆర్బీకే వ్యవస్థ ప్రతి అడుగులో రైతులకు తోడుగా ఉండేవని,కానీ, ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీరం చేసిందని జగన్ విమర్శించారు. ఇవాళ అన్ని వ్యవస్థలునిర్వీర్యమయ్యాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలని, మొత్తం పంటను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి, మామిడి రైతులను ఆదుకోవాలని జగన్ కోరారు. లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాడుతామని జగన్ హెచ్చరించారు.

ప్రభుత్వం ఇంత క్రూరంగా వ్యవహరిస్తోందని, ఎందుకు రైతులను రానీయకుండా అడ్డుకుంటోందని జగన్ ప్రశ్నించారు. దాదాపు 1200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారని, ఇక్కడ ఒకరి తల పగలగొట్టారని, అసలు మీరు మనుషులేనా అని అడిగారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్‌ పలుకుతున్నాడని, మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలపై జగన్‌ మాత్రమే మాట్లాడుతున్నాడని, ఇంకా ఎవరికి ఏ సమస్య వచ్చినా, జగన్‌ ముందు ఉంటున్నాడని తెలిపారు. వచ్చేది జగన్‌ ప్రభుత్వమే, ఇది గుర్తు పెట్టుకోండని తెలిపారు.