నెల్లూరులో చారిత్రక వీఆర్ మోడల్ స్కూల్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్
2019 మంగళగిరి ఓటమి తనలో పట్టుదల పెంచిందని భావోద్వేగ ప్రసంగం
కష్టమైన శాఖ అని తెలిసినా సవాలుగా విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించానని వెల్లడి
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని హామీ
సీఎం సూచనతోనే మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం ప్రవేశపెట్టామని వెల్లడి
ANDHRAPRADESH:2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఎదురైన ఓటమి తనలో తీవ్రమైన కసిని, పట్టుదలను పెంచిందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ ఓటమి నుంచే పాఠాలు నేర్చుకుని ఐదేళ్ల పాటు కష్టపడినందుకే, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని మెజారిటీతో ప్రజలు తనను గెలిపించారని ఆయన భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. నెల్లూరులో చారిత్రక వీఆర్ మోడల్ పాఠశాలను సోమవారం ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లోకేశ్ మాట్లాడుతూ, సవాళ్లను స్వీకరించడం తనకు ఇష్టమని, అందుకే ఎంతో కష్టమైన శాఖ అని తెలిసినా విద్యాశాఖ బాధ్యతలను కోరి మరీ తీసుకున్నానని తెలిపారు. "చాలా మంది సీనియర్లు, జూనియర్లు ఇది కఠినమైన శాఖ, నీకెందుకు అని అడిగారు. కానీ విద్యావ్యవస్థను మార్చగలిగితే ఏ శాఖనైనా మార్చవచ్చనే నమ్మకంతోనే ఈ బాధ్యత చేపట్టా. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నా," అని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ పునరుద్ఘాటించారు. నాణ్యమైన యూనిఫాంలు, పుస్తకాలు, బ్యాగులతో పాటు ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులకు ఆధునిక సాంకేతికతను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం ప్రవేశపెట్టడం వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని లోకేశ్ పంచుకున్నారు. "గతంలో ఒక పాఠశాల సందర్శనలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విద్యార్థులతో కలిసి కింద కూర్చుని భోజనం చేశారు. ఆ అన్నం బాగాలేదని, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని ఆయన వెంటనే ఆదేశించారు. ఆయన సూచన మేరకే ఈ మార్పు తీసుకొచ్చాం," అని వివరించారు. విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఏటా జులై 10, డిసెంబర్ నెలల్లో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లు నిర్వహిస్తామని ప్రకటించారు.
కార్యక్రమానికి ముందు లోకేశ్ పాఠశాలలోని తరగతి గదులను, డిజిటల్ విద్యావిధానాన్ని పరిశీలించి, విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. వారితో కలిసి క్రికెట్, వాలీబాల్ ఆడి ఉత్సాహపరిచారు. మూతబడిన ఈ పాఠశాలను పునఃప్రారంభించడానికి విశేష కృషి చేసిన మంత్రి నారాయణను ఆయన అభినందించారు. ఈ పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను సత్కరించారు.
Social Plugin