Ticker

6/recent/ticker-posts

పూజా హెగ్డేకు భారీ షాక్.. ధనుష్ సినిమా నుంచి అవుట్!

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పూజా హెగ్డే

ధనుష్ సినిమాలో పూజా స్థానంలో మలయాళ నటి మమితా బైజు ఎంపిక

రజనీ, విజయ్ సినిమాలతో బిజీగా ఉన్న పూజ

ANDHRAPRADESH:ఒకప్పుడు వరుస విజయాలతో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన పూజా హెగ్డేకు ఈమధ్య కాలం కలిసి రావడం లేదు. వరుస ఫ్లాపుల కారణంగా ఆమె కెరీర్ కాస్త నెమ్మదించింది. ఈ ప్రభావం తాజాగా ఆమెకు దక్కాల్సిన ఓ క్రేజీ ఆఫర్‌పై పడింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన నటించే అవకాశాన్ని పూజా హెగ్డే కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న మలయాళ బ్యూటీ మమితా బైజును ఎంపిక చేసినట్లు సమాచారం.

సినీ పరిశ్రమలో విజయాలు, అపజయాలు కెరీర్‌ను ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. గతంలో పూజా హెగ్డే దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా భారీ రెమ్యునరేషన్ అందుకున్నారు. అయితే ‘రాధే శ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’ నుంచి ఇటీవల వచ్చిన ‘రెట్రో’ వరకు ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో ఆమె క్రేజ్ కొంతమేర తగ్గింది.

ఈ నేపథ్యంలోనే ధనుష్ హీరోగా దర్శకుడు విగ్నేష్ రాజా తెరకెక్కించనున్న కొత్త సినిమా కోసం మొదట పూజా హెగ్డేని అనుకున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆమెను పక్కనపెట్టి, ‘ప్రేమలు’ సినిమాతో సెన్సేషన్ అయిన మమితా బైజును ఫైనల్ చేశారని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మమితా.. దళపతి విజయ్, సూర్య వంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇప్పుడు ధనుష్ సినిమాలో ఛాన్స్ రావడంతో ఆమె కెరీర్ దూసుకుపోవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.

అయితే ఈ ఒక్క ఆఫర్ చేజారినప్పటికీ, పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. ఆమె రజనీకాంత్, విజయ్, లారెన్స్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు.