Ticker

6/recent/ticker-posts

జగన్ చిత్తూరు టూర్ వేళ తోతాపురిపై ప్రభుత్వం కీలక ప్రకటన..!


ANDHRAPRADESH:ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా తోతాపురి మామిడి పళ్లడే చర్చ. మామిడి పళ్ల సీజన్ ముగిసిపోయినా ఇంకా తోతాపురిపై చర్చ జరగడానికి ప్రధాన కారణం చిత్తూరు జిల్లాలో ఈ పంట పండిస్తున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు కూడా ఈ తోతాపురి మామిడి పళ్ల రవాణా విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో తోతాపురి రైతులకు అండగా నిలిచేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎల్లుండి చిత్తూరు టూర్ ప్లాన్ చేశారు.

ఎల్లుండి జగన్ చిత్తూరు జిల్లాలోని బంగారు పాళ్యం మార్కెట్ యార్డ్ కు వెళ్లి తోతాపురి రైతుల్ని పరామర్శించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయాలు ప్రకటించింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కీలక ప్రకటన విడుదల చేశారు. ఇందులో చిత్తూరు జిల్లాలో 38706 మంది రైతుల నుంచి 2.22 లక్షల తోతాపురి మామిడి పళ్లను సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

అలాగే కేజీ తోతాపురి మామిడి పళ్లకు ప్రాసెసింగ్ యూనిట్లు ఇప్పటికే రూ.8 చెల్లిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4 మద్దతు ధర ప్రకటించామని, ఇలా కేజీ తోతాపురి మామిడికి రైతులకు మొత్తం రూ.12 రూపాయలు ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. చివరి కేజీ వరకూ తోతాపురి మామిడి పళ్లను రైతుల నుంచి సేకరిస్తామని ఆయన వెల్లడించారు. పార్లే, కోకాకోలా, పెప్సీకో వంటి సంస్థలతో చర్చించి మామిడి గుజ్జుకు న్యాయపరమైన ధర అందించేందుకు ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేశామన్నారు. మార్కెట్ స్థిరీకరణ నిధి నుంచి రూ.130 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్నీ కోరామన్నారు.

ప్రతీ ప్రాసెసింగ్ యూనిట్ వద్ద దశల వారీగా అధికారుల్ని నియమించి తోతాపురి మామిడి పళ్లను రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వివరించారు. ప్రతీ యూనిట్ కు నలుగురు సిబ్బందిని షిఫ్ట్ ల విదానంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గ్రామ సభలు, రైతు సహాయక కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. జగన్ టూర్ నేపథ్యంలో ప్రభుత్వం తోతాపురి మామిడి విషయంలో తీసుకుంటున్న చర్యలపై చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది