సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో ఘటన
అత్త మీద పలు రకాల బీమాలు చేయించిన అల్లుడు
సుపారీ ఇచ్చి అత్తను హత్య చేయించిన అల్లుడు
సీసీ ఫుటేజీ ఆధారంగా డ్రైవర్ గుర్తింపు
HYDERABAD;సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాన్‌సాన్‌పల్లి శివారులో ఇటీవల జరిగిన కారు ప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో 60 ఏళ్ల రామవ్వ మృతి చెందగా, ఇది ప్రమాదం కాదని, హత్య అని పోలీసుల విచారణలో తేలింది. రూ. 60 లక్షల ప్రమాద బీమా కోసం అల్లుడే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెద్దమాన్‌సాన్‌పల్లి శివారులో ఈ నెల 7న కారు ఢీకొని రామవ్వ మృతి చెందింది. ఆమె అల్లుడు వెంకటేశ్ ప్రమాదం జరిగిందని ఫిర్యాదు చేశాడు. కేసును విచారించిన పోలీసులు, ప్రమాద బీమా కోసం అల్లుడు ఈ హత్య చేయించినట్లు నిర్ధారించారు.
వెంకటేశ్ గతంలో అత్తగారిపై పలు రకాల బీమా పాలసీలు తీసుకున్నాడు. ఈ క్రమంలో బీమా డబ్బుల కోసం ఆమెను కారుతో ఢీకొట్టి చంపేందుకు కరుణాకర్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాను చెప్పినట్లు చేస్తే బీమా సొమ్ములో సగం ఇస్తానని అతనికి చెప్పాడు.
ఆ తరువాత, పొలం పనుల నిమిత్తమని చెప్పి వెంకటేశ్ అత్తగారిని ఊరికి తీసుకువచ్చాడు. పథకం ప్రకారం ఈ నెల 7న రాత్రి పొలం నుంచి ఆమెను ఒంటరిగా ఇంటికి పంపించాడు. నడుచుకుంటూ వెళుతున్న ఆమెను కరుణాకర్ కారుతో ఢీకొట్టాడు. వెంకటేశ్, కరుణాకర్‌కు ఒక అద్దె కారును సమకూర్చాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా డ్రైవర్‌ను గుర్తించగా, కరుణాకర్ విచారణలో నేరం అంగీకరించాడు.
Social Plugin