Ticker

6/recent/ticker-posts

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో కవితకు ఏం సంబంధం?: మహేశ్ కుమార్ గౌడ్


రిజర్వేషన్ల క్రెడిట్ బీఆర్ఎస్ తీసుకోవడం ఏమిటని ప్రశ్నించిన టీపీసీసీ చీఫ్

కవితను చూసి జనాలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్య

కేసీఆర్ పదేళ్లు ఏం వెలగబెట్టారని నిలదీత

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఆ ఘనతను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీసుకోవడం ఏమిటని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.

ఈ నిర్ణయం వెనుక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆశయం ఉందని ఆయన పేర్కొన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని మరోసారి నిరూపితమైందని అన్నారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేస్తోందని వివరించారు.

బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పార్టీకి, కవితకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. తాము చేసిన పనికి ఆమె క్రెడిట్ తీసుకోవడం ఏమిటని నిలదీశారు. కవితను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ పదేళ్లు ఏం చేశారో చెప్పకుండా ఆమె బీసీ పాట పాడుతున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు రాహుల్ గాంధీ అజెండా, రేవంత్ రెడ్డి నిబద్ధత అని ఆయన స్పష్టం చేశారు.