Ticker

6/recent/ticker-posts

వ‌స్త్ర ధార‌ణ‌పై ప‌వ‌న్‌కు చుర‌క‌లు!


ANDRAPRADESH: డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ వేష‌ధార‌ణ‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు చుర‌క‌లు అంటిస్తున్నారు. కీల‌క‌మైన ఉప ముఖ్య‌మంత్రి హోదాలో వుంటూ, అందుకు త‌గ్గ‌ట్టుగా వ‌స్త్ర‌ధార‌ణ వుండాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటారు. వ‌స్త్ర‌ధార‌ణ అనేది హోదాకు త‌గిన విధంగా హూందాగా వుండాల‌ని ఆశించ‌డంలో త‌ప్పులేదు. అయితే “నా వ‌స్త్రాలు, నా ఇష్టం” అనుకునే వాళ్ల‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు. కానీ ప్ర‌జ‌ల్లో చుల‌క‌న అవుతారు. ప్ర‌జ‌ల్లో మ‌నిషి అయిన త‌ర్వాత‌, వాళ్ల ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్టుగా న‌డుచుకోవ‌డం రాజ‌కీయ నాయ‌కుల బాధ్య‌త‌.


ఆ స్పృహ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌లో కొర‌వ‌డిన‌ట్టుంది. ఇవాళ పెనమలూరు నియోజ‌క‌వ‌ర్గంలోని కానూరు రోడ్డు అయ్య‌ప్ప‌న‌గ‌ర్ స‌మీపంలో సెలూన్ ప్రారంభానికి ప‌వ‌న్ వెళ్లారు. టీ ష‌ర్ట్‌, షార్ట్‌లో ప‌వ‌న్ క‌నిపించ‌డంతో అభిమానులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ఉప ముఖ్య‌మంత్రి అనే సంగ‌తి ప‌వన్‌కు గుర్తు లేన‌ట్టుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌స్త్ర‌ధార‌ణ ఒక్కోసారి ఒక్కోలా వుంటోంది. కొన్ని సంద‌ర్భాల్లో స‌న్యాసులు ధ‌రించే కాషాయ వ‌స్త్రాల్లో క‌నిపిస్తారు. ఇప్పుడేమో టీ ష‌ర్ట్‌, షార్ట్‌లో ప్ర‌త్య‌క్ష‌మై… ఔరా అనిపించారు. సినిమా షూటింగ్‌ల‌కు వెళ్లిన‌ట్టు, సెలూన్ ప్రారంభానికి హాజ‌రు కావ‌డం ఏంట‌ని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు.

కాస్త పెద్ద‌రికం, హూందాత‌నం క‌నిపించేలా దుస్తులు వేసుకోవ‌చ్చు క‌దా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. వ‌స్త్ర‌ధార‌ణ అనేది రాజ‌కీయ నాయ‌కుల గౌర‌వాన్ని పెంచేలా వుండాల‌నేది నెటిజ‌న్లు అభిప్రాయం. అయితే ప‌వ‌న్ అన్నింటికీ తాను అతీతం అన్న‌ట్టుగా న‌డుచుకుంటుంటారు.