ANDHRAPRADESH: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు, విచారణను ఎదుర్కొంటోన్న మాజీ ఐఎఎస్ అధికారి కే ధనంజయ రెడ్డి, పీ కృష్ణమోహన్ రెడ్డితో అయిదు మంది నిందితులకు విజయవాడలోని అవినీతి నిరోధక విభాగం ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. జులై 1వ తేదీ వరకు రిమాండ్ లో ఉండనున్నారు.
ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసుల కస్టడీలో ఉంటోన్నారు. మద్యం కేసు విచారణను ఎదుర్కొంటోన్నారు. వారి రిమాండ్ ముగియాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఉదయం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు
వాదోపవాదాలను విన్న అనంతరం కోర్టు.. ఈ ఏడుమంది నిందితుల జ్యుడీషియల్ కస్టడీని జులై 7వ తేదీ వరకు పొడిగించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతోన్న మద్యం కుంభకోణం కేసులో ధనంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఏ31, ఏ32గా ఉన్నారు.
దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
గతంలో విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్సీపీకి చెందిన కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి.. సిట్ విచారణకు హాజరయ్యారు కూడా. తమ వివరణలను ఇచ్చుకున్నారు. ఇదే కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప తొలుత అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది.
ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి.. మూడు రోజుల పాటు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు. అదే సమయంలో ముందస్తు బెయిల్ పిటీషన్ కూడా దాఖలు చేసుకున్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వాళ్లు దాఖలు చేసుకున్న పిటీషన్ ను కొట్టివేసింది.
Social Plugin