Ticker

6/recent/ticker-posts

వైసీపీ మళ్లీ వస్తే, వాలంటీర్లకు షాక్ తప్పదా? సీఎం జగన్ ఆ నిర్ణయం తీసుకుంటారా?


ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థ ఓ సంచలనం. ఈ వ్యవస్థ కారణంగా వైసీపీ ప్రభుత్వం అమలుచేసిన పథకాలన్నీ పక్కాగా అమలయ్యాయి. వార్డులు, గ్రామాల్లో ప్రతీ ఇంటికీ పథకాల్ని చేరవెయ్యడంలో వాలంటీర్లు సక్సెస్ అయ్యారు. ఐతే.. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి ఆర్థిక భారం అనే విమర్శలు కూడా ఉన్నాయి. వాలంటీర్లు లేకుండా కూడా ప్రభుత్వం పథకాలను అమలుచెయ్యవచ్చు. అందుకోసం పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం.. ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి.. వాలంటీర్లపై పూర్తిగా ఆధారపడింది. అందువల్ల ఈ వ్యవస్థ ఇప్పుడు ఏపీలో కీలకంగా మారింది.


వాలంటీర్ల వ్యవస్థ బలంగా ఉండటం వల్లే.. ప్రతిపక్ష టీడీపీ కూడా.. వాలంటీర్లను కొనసాగిస్తామని తెలిపింది. అంతేకాదు.. వారికి ఇప్పుడిస్తున్న శాలరీ రూ.5000ను రూ.10,000 చేస్తామని కూడా హామీ ఇచ్చింది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే, ఆ హామీ అమలవుతుందా లేదా అన్నది పక్కన పెడితే.. వాలంటీర్ వ్యవస్థను పార్టీలు కీలకమైనదిగా భావిస్తున్నాయన్నది గమనించదగ్గ అంశంగా ఉంది.

వాలంటీర్లకు షాక్ తప్పదా?
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి.. వాలంటీర్లు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదని ఎన్నికల సంఘం చెప్పడంతో.. దీని వెనక టీడీపీ చక్రం తిప్పిందని వైసీపీ నేతలు ఆరోపణలు చెయ్యడంతో.. ఆగ్రహించిన వాలంటీర్లు.. వైసీపీకి సపోర్టుగా రాజీనామాలు చెయ్యడం ప్రారంభించారు. ఇప్పటికే 70వేల మంది దాకా రాజీనామా చేశారు. తిరిగి వైసీపీ ప్రభుత్వం రాగానే.. వారి ఉద్యోగాలు వారికి వస్తాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఐతే.. సీఎం జగన్ ఆలోచన మరోలా ఉందనే వాదన వినిపిస్తోంది.

ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ పనిచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే.. ఈసారి 70 ఇళ్లకు ఒక వాలంటీర్ పనిచేస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని నిన్నటి పొన్నూరు ఎన్నికల ప్రచారంలో స్వయంగా సీఎం జగనే చెప్పారు. ప్రతీ 60, 70 ఇళ్లకు ఒక వాలంటీర్ పనిచేస్తున్నారని అన్నారు. తద్వారా వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ప్రతీ వాలంటీర్‌కీ మరో 20 ఇళ్లు అదనంగా ఇచ్చి.. 70 ఇళ్లకు ఒక వాలంటీర్‌ని నియమిస్తారని తెలుస్తోంది. తద్వారా వాలంటీర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు రాజీనామా చేస్తున్న వారందరికీ తిరిగి ఉద్యోగాలు వస్తాయనే గ్యారెంటీ లేదు.

ఏపీలో దాదాపు 2.66 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వారిలో ఇప్పటికే 70వేల మంది రాజీనామా చెయ్యడం వల్ల.. మరో 2 లక్షల మంది దాకా విధుల్లో ఉన్నట్లైంది. రేపు వైసీపీ అధికారంలోకి వస్తే, వారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారనీ, వారికే ఎక్కువ ఇళ్లను అప్పగించి, వారితోనే పథకాల అమలును కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది. తద్వారా వారి శాలరీలను కొంత పెంచినా, ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరగకుండా ఉంటుందని సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం ఏదీ లేదు. కానీ పొలిటికల్ సర్కి్ల్‌లో మాత్రం ఈ ప్రచారం జరుగుతోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి, ఇదే జరిగితే మాత్రం వాలంటీర్లకు అన్యాయం జరిగినట్లే అనుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.