Ticker

6/recent/ticker-posts

ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా తొలి విడత పంచాయతీ ఎన్నికలు


 కామవరపుకోట: ఏలూరు జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. గురువారం కామవరపుకోట మండలం తడికలపూడి, కామవరపుకోట గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు.

జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ పేర్కొన్నారు.

తొలి విడతలో జిల్లాలోని 11 మండలాల పరిధిలో 164 గ్రామాల్లో సర్పంచ్, 1,567 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 619 మంది రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, జోనల్, రూట్ అధికారులతో పాటు 6,193 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు వివరించారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎం.వి. రమణ, తహసీల్దార్ గెడ్డం ఎలీషా తదితరులు పాల్గొన్నారు.