కారా నిబంధనల ప్రకారం కలెక్టర్ నుంచి తుది ఉత్తర్వులు పొందాలి: కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు, నవంబర్ 13: పిల్లలను దత్తత తీసుకునే విషయంలో ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా పొందాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. దత్తత ప్రక్రియను చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం పూర్తి చేసిన తర్వాతే తుది దత్తత ఉత్తర్వులు జారీ అవుతాయని తెలిపారు.
శుక్రవారం దెందులూరు మండలానికి చెందిన దంపతులు కామవరపుకోటకు చెందిన తమ బంధువుల దంపతుల వద్ద ఉన్న పదేళ్ల బాలికను బంధుత్వ దత్తత కింద స్వీకరించారు. ఇందుకోసం సంబంధిత వివరాలను CARINGS పోర్టల్లో రిలేటివ్ అడాప్షన్ విభాగంలో నమోదు చేసి, దత్తత ప్రక్రియకు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించారు. నిబంధనల ప్రకారం పరిశీలన పూర్తయిన అనంతరం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి నుంచి తుది దత్తత ఉత్తర్వులు పొందారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు తమ బంధువుల పిల్లలను దత్తత తీసుకోవాలనుకున్నా, ఇతరత్రా దత్తత ప్రక్రియ చేపట్టాలనుకున్నా మిషన్ వాత్సల్య పరిధిలోని CARA నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బంధుత్వ దత్తతతో పాటు స్టెప్ పేరెంట్ దత్తత వంటి ప్రక్రియలకు కూడా నిర్దేశిత విధానాలను అనుసరించాలని చెప్పారు. అవసరమైన అనుమతులు, కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ నుంచి తుది ఉత్తర్వులు పొందిన తర్వాతే దత్తత ప్రక్రియ చట్టబద్ధంగా పూర్తవుతుందని వివరించారు.
అనాథలు, వదిలివేయబడిన పిల్లలు, తల్లిదండ్రులు ప్రభుత్వానికి సరెండర్ చేసిన పిల్లలను ప్రభుత్వ విధానం ద్వారా దత్తత తీసుకోవడం ఒక విధానమని, దేశీయ బంధుత్వ దత్తత, స్టెప్ పేరెంట్ దత్తత వంటివి ఇతర విధానాలని కలెక్టర్ వివరించారు. హిందూ దత్తత చట్టం ప్రకారం దత్తత తీసుకున్న సందర్భాల్లోనూ వర్తించే నిబంధనల మేరకు కలెక్టర్ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) పొందాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి సీహెచ్. సూర్య చక్రవేణి, శిశు గృహ మేనేజర్ భార్గవి తదితరులు పాల్గొన్నారు.

