Ticker

6/recent/ticker-posts

చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు


చింతలపూడి: నగర పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఏలూరు జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు కైకలూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి. రవికుమార్ పర్యవేక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. నగర పంచాయతీ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

వృద్ధులు, దివ్యాంగులు, మహిళా ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు ప్రత్యేక సహాయ సహకారాలు అందించారు. వృద్ధులు, దివ్యాంగులను వీల్‌చైర్లు, కుర్చీల సహాయంతో పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి ఓటు వేసిన అనంతరం సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించారు. నిరంతర పెట్రోలింగ్, మొబైల్ పోలీసు బృందాలతో పర్యవేక్షణ చేపట్టారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, భయభ్రాంతులకు గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసు శాఖకు సహకరించాలని ఇన్‌స్పెక్టర్ వి. రవికుమార్ కోరారు. ఎక్కడైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు ఎదురైతే వెంటనే సమీప పోలీసు అధికారులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు.