Ticker

6/recent/ticker-posts

రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన


ఆంధ్రప్రదేశ్, అమరావతి, AUG, 12: అసెంబ్లీకి రాకుండా బయట ఆరోపణలు చేయడమేంటి? అని వైసీపీని ఏపీ హోంమంత్రి అనిత ప్రశ్నించారు. ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం అనంతరం వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. ‘‘వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై స్పందిస్తూ.. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు శాసనసభలో తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించే బాధ్యత ఉందన్నారు. గతంలో శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పుడు అదే మండలికి తమ పార్టీ ప్రతినిధులను పంపుతున్నారు. 


మరోవైపు ప్రజలు ఎన్నుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకపోవడం సమంజసం కాదు.’’ అని అన్నారు. “ఎమ్మెల్యేగా గెలవడం ఎంత గొప్ప బాధ్యతో.. నియోజకవర్గ ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత. జగన్‌తో పాటు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా సభలో ప్రజల తరఫున మాట్లాడే అవకాశం ఉండాలి” అని అన్నారు.

ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హోంమంత్రి స్పష్టం చేశారు. “రోడ్లపై ఆరోపణలు చేయడం కాదు. జగన్‌మోహన్‌రెడ్డికి ధైర్యముంటే అసెంబ్లీకి రావాలి. వారి దగ్గర ఉన్న ఆధారాలను సభ ముందు ఉంచాలి. ప్రతి అంశంపై చర్చించి సమాధానం చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీ కంటే గొప్ప ప్రజాస్వామ్య వేదిక మరొకటి లేదు” అని పేర్కొన్నారు.

మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను హోంమంత్రి ఖండించారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో మెగా డీఎస్సీని పూర్తి చేయలేకపోయిందని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మెగా డీఎస్సీకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. డీఎస్సీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని, నియామకాలపై వచ్చిన ఆరోపణలకు సంబంధిత అధికారులు ఆధారాలతో వివరణ ఇచ్చారని పేర్కొన్నారు. 

అయినప్పటికీ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, సీబీఐ విచారణ జరపాలని వైసీపీ పదేపదే డిమాండ్ చేయడం రాజకీయ ప్రయోజనాల కోసం యువతలో అనుమానాలు సృష్టించే ప్రయత్నమేనన్నారు. “ఐదేళ్లు అధికారంలో ఉండి ఒక్క డీఎస్సీని కూడా పూర్తి చేయలేని వారు… ఇప్పుడు ఉద్యోగాలు పొందిన తర్వాత అక్రమాలు జరిగాయని ఆరోపించడం విడ్డూరంగా ఉంది. మీ దగ్గర ఆధారాలు ఉంటే అసెంబ్లీకి వచ్చి చూపించండి. ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని అన్నారు.

మెగా డీఎస్సీ నియామకాలన్నీ అక్రమమంటూ ఆరోపణలు చేయడం ద్వారా ప్రభుత్వం మీదనే కాకుండా, కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల ప్రతిభపై కూడా అనుమానాలు కలిగిస్తున్నారని అనిత పేర్కొన్నారు. ఐదేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ.. కుటుంబాలకు దూరంగా ఉండి కోచింగ్ తీసుకుని, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఎంతోమంది అభ్యర్థులు కష్టపడి ఉద్యోగాలు సాధించారని తెలిపారు. “ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన యువత ఇప్పుడు తమ భవిష్యత్తుపై భరోసాతో ముందుకు వెళ్తున్నారు. 

మొత్తం డీఎస్సీ నియామకాలే అక్రమమని మాట్లాడితే వారి కష్టాన్ని, ప్రతిభను, వారి కుటుంబాల ఆనందాన్ని అవమానించినట్లే కాదా? రాజకీయాల కోసం యువత మనోభావాలతో ఆడుకోవద్దు. నిందలు వేయడం, అలజడి సృష్టించడం కాకుండా జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా చర్చించాలి. ప్రజలకు వాస్తవాలు తెలుసు. ప్రభుత్వం ప్రతి అంశంపై సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉంది” అని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 65 వినతులను స్వీకరించారు. ఒక్కొక్కరి సమస్యను అడిగి తెలుసుకుని, పరిష్కారం సాధ్యమైన అంశాలపై సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజూ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వినతులు స్వీకరిస్తున్నారని హోంమంత్రి తెలిపారు. 

వినతి తీసుకోవడంతోనే బాధ్యత పూర్తయినట్లు కాదని, సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ బాధితులకు సాధ్యమైనంత త్వరగా న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. మాషా అల్లా ఎంటర్‌ప్రైజెస్ వ్యవహారంలో డబ్బులు కోల్పోయామని పేర్కొంటూ పలువురు బాధితులు హోంమంత్రిని కలిసి తమ సమస్యను వివరించారు. ఈ వ్యవహారంలో దాదాపు 200 మంది బాధితులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని అనిత తెలిపారు. 

బాధితుల ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందించిందని, వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు డీసీపీ తిరుమలేశ్వరరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదులను పరిశీలించి, దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.