Ticker

6/recent/ticker-posts

జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!


ఆంధ్రప్రదేశ్, అమరావతి, AUG, 12: విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 2009 జీవో నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒకసారి జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ పెంపు చేపట్టాల్సి ఉందని, కనీసం 15 శాతం పెంచాలని కోరితే ప్రభుత్వం కేవలం 3 శాతం మాత్రమే పెంచుతామని చెప్పడం వైద్యులను తీవ్రంగా అవమానించడమేనని జూనియర్ వైద్యుల సంఘం విశాఖ అధ్యక్షుడు దినకర్ మండిపడ్డారు. 


ప్రభుత్వం ప్రతినిధులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని, అందుకే తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెను కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అహోరాత్రులు సమయంతో సంబంధం లేకుండా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్ల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

సమ్మె మరింత తీవ్ర రూపం దాల్చకముందే ప్రభుత్వం పునరాలోచించి మేల్కోవాలని, ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు నిలిచిపోయే దుస్థితి తెప్పించవద్దని వైద్య సంఘాల నాయకులు హెచ్చరించారు. ఏపీ జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ పెంపు డిమాండ్లను వెంటనే నెరవేర్చడంతో పాటు, డాక్టర్ల పదవీ విరమణ వయోపరిమితిని 62 ఏళ్లకు పరిమితం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న పాలకులు చొరవ తీసుకుని తమ సమస్యలను పరిష్కరిస్తేనే విధుల బాట పడతామని, లేని పక్షంలో తమ పోరాటం ఆపేది లేదని జూనియర్ వైద్యులు కుండబద్దలు కొట్టారు.