ANDRAPRADESH, MAY, 08: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డయాలసిస్ రోగులకు అవసరమైన డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు (రక్త శుద్ధి) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.ఈ విషయాన్ని వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. టెండర్ ద్వారా ఎంపిక చేసిన సంస్థ 3 నెలల్లోగా ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యతల్ని చేపట్టనుంది అని పేర్కొన్నారు.
ప్రైమ్ మినిస్టర్ నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం' (PMNDP) కింద రాష్ట్రంలోని సెకండరీ ఆసుపత్రుల్లో (జిల్లా, ప్రాంతీయ, సామాజిక) 61 కేంద్రాలు నడుస్తున్నాయి. వీటికి అదనంగా ఈ 12 కేంద్రాలు వస్తున్నాయి. అదనపు కేంద్రాలతో కలిపి మొత్తం 73 అందుబాటులో ఉంటాయి అని వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కొత్త కేంద్రాల రాకతో దూర ప్రాంతాలకు వెళ్లి రక్త శుద్ధి చేయించుకునే రోగులకు అవస్థలు తగ్గుతాయి. ఈ సేవలు పూర్తిగా ఉచితం.
ఈ కేంద్రాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ఐదేళ్లకు కలిపి సుమారు రూ.30 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాలంటే ఒక్కొక్క సెషన్‌కు కనీసం రూ.3,000 నుంచి రూ.4,000 వరకు వ్యయం అవుతుంది. ఒక్కొక్కరికి నెలకు నాలుగైదుసార్లు రక్త శుద్ధి చేయాల్సి ఉంటుంది అయితే ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లో ఉచితంగా జరుగుతుంది అని వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
కిడ్నీ రోగులకు సాంత్వన చేకూర్చేలా
గత వైసీపీ (2019-2024) పాలనలో 19 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు 12 కేంద్రాలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటికి అదనంగా ఈ 12 కేంద్రాలు రాబోతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నేడొక ప్రకటనలో వెల్లడించారు. 23 నెలల్లో 24 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని...కూటమి ప్రభుత్వం రోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం , చిత్తూరు జిల్లా పీలేరు, వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు ఏరియా ఆసుపత్రుల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి. అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరి, ప్రకాశం జిల్లా అద్దంకి, నంద్యాల జిల్లా సున్నిపెంట, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు, ప్రకాశం జిల్లా కొండేపి, తూర్పుగోదావరి జిల్లా కోవూరు, కడప జిల్లా మైదుకూరు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, పల్నాడు జిల్లా వినుకొండ సామాజిక ఆసుపత్రుల్లో ఈ కేంద్రాలు వస్తున్నాయి. ఒక్కో కేంద్రంలో రక్త శుద్ధి నిర్వహణ కోసం 5 చొప్పున మెషిన్లు సమకూరుస్తారు.
ఒక్కొక్క కేంద్రంలో సుమారు రూ.85 లక్షలు విలువచేసే రక్త శుద్ధి యంత్రాలు/పరికరాలను సమకూరుస్తారు. వీటివల్ల 1,500 మంది రోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇవికాకుండా.. ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ కింద 186 అనుబంధ ఆసుపత్రుల్లోని కేంద్రాల్లో కిడ్నీ బాధితులు ఉచితంగా డయాలసిస్ సేవలు పొందుతున్నారు. పీఎంఎన్డీపీ, ఎన్టీఆర్ వైద్యా సేవా ట్రస్ట్ కింద కలిపి కిడ్నీ రోగుల కోసం ప్రతి ఏటా సుమారు రూ.165 కోట్ల వరకు కూటమి ప్రభుత్వం ఖర్చుపెడుతోంది. దీర్ఘకాలంపాటు డయాలసిస్ అవసరమైన వారి ప్రాణాలు ఈ కేంద్రాల ద్వారా నిలబడుతున్నాయి.

