TELANGANA, JUL, 22: హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో ట్రాన్స్‌కో డిప్యూటీ ఇంజనీర్ (డీఈ) ముత్యం వెంకటరమణ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. గత 12 గంటలుగా కొనసాగుతున్న ఈ తనిఖీల్లో రెండు ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. మొత్తం 9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టిన అధికారులు, నగదు, కీలక పత్రాలు, బంగారం, వజ్రాభరణాలు, విదేశీ మద్యం బాటిళ్లతో పాటు కియా, మహీంద్రా, బలెనో కంపెనీలకు చెందిన మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ముత్యం వెంకటరమణ ప్రస్తుతం రెడ్‌కోలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు.
భార్య పేరుతో ఫ్లాట్లు.. గతంలోనూ లంచం కేసులో అరెస్ట్
సోదాల్లో ముత్యం వెంకటరమణ భార్య స్వప్న పేరుతో నిర్మాణ రంగంలో భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఆంజనేయనగర్, మూసాపేట్ ప్రాంతాల్లో 10 ఫ్లాట్లు, నాలుగు రెసిడెన్షియల్ ఫ్లాట్లు, G+3 కమర్షియల్ భవనాలు, ఖానామెట్ గుట్టల బేగంపేట్‌లో G+5 కమర్షియల్ భవనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
2019లో రూ.26 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ముత్యం వెంకటరమణపై అప్పటి నుంచే నిఘా కొనసాగుతోందని, విద్యుత్ శాఖలో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన సమయంలో అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఆస్తులు, పత్రాల ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.

