INDIA NEWS, JUL, 30: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 215 మంది విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటిని ఉద్దేశించి ప్రియాంక గాంధీ ‘‘గోమూత్ర నిపుణుడు’’ అంటూ వ్యాఖ్యానించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు వైస్ చాన్సలర్లు, మాజీ వైస్ చాన్సలర్లు, ప్రముఖ విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త విద్యార్హతలను రాజకీయ వ్యాఖ్యలతో తక్కువ చేసి చూపడం సరికాదని పేర్కొన్నారు.
పరీక్షల సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త టాస్క్‌ఫోర్స్‌లో ప్రొఫెసర్ వి. కామకోటి సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఉద్దేశించి ప్రియాంక గాంధీ చేసినట్లు ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలపై 215 మంది విద్యావేత్తలు స్పందించారు. ‘‘ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటిని ‘గోమూత్ర నిపుణుడు’గా అభివర్ణించినట్లు వచ్చిన మీ వ్యాఖ్యలపై మేము తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నాం. ఈ వ్యాఖ్యలు వ్యంగ్యంగా చేసినవైనా లేదా రాజకీయ విమర్శల ఉద్దేశంతో చేసినవైనా.. అవి ఒక వ్యక్తికి మాత్రమే పరిమితమైన అంశం కాదు. దీనివల్ల మరింత ఆందోళనలు తలెత్తుతున్నాయి’’ అని బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
ఒక శాస్త్రవేత్త లేదా విద్యావేత్త అభిప్రాయాల్లోని అంశాలపై చర్చించకుండా.. కేవలం ఒక లేబుల్‌తో ఆయనను కొట్టిపారేయడం రాజ్యాంగం ప్రోత్సహిస్తున్న శాస్త్రీయ దృక్పథానికే విఘాతం కలిగించే ప్రమాదం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసినప్పుడు వారిని అవమానకరమైన పేర్లతో తక్కువ చేయకుండా చర్చ జరిగే వాతావరణం ఉండాలని పేర్కొన్నారు.
‘‘ప్రొఫెసర్ కామకోటి దేశంలోని అత్యున్నత శాస్త్ర, సాంకేతిక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ మద్రాస్‌కు అధిపతి. ఆయన ఐఐటీ మద్రాస్ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్, పీహెచ్‌డీ పట్టాలు పొందారు. 150కిపైగా పరిశోధన పత్రాలను ప్రచురించారు. 50కిపైగా పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అయ్యారు’’ అని లేఖలో వివరించారు.
ప్రొఫెసర్ కామకోటికి డీఆర్‌డీవో అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డు, ఇండియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ టెక్నో విజనరీ అవార్డు సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయని విద్యావేత్తలు పేర్కొన్నారు. భారతదేశంలో తొలి ఇండస్ట్రీ-గ్రేడ్ మైక్రోప్రాసెసర్ అభివృద్ధికి ఆయన మార్గనిర్దేశం చేశారని తెలిపారు. దేశంలోని అగ్రశ్రేణి సాంకేతిక మేధావుల్లో ఒకరని పేర్కొన్నారు. చరిత్రను పరిశీలిస్తే ఒకప్పుడు అసాధ్యంగా లేదా నమ్మశక్యంగా లేవని భావించిన అనేక ఆలోచనలకు తర్వాత కాలంలో శాస్త్రీయ ఆధారాలు లభించాయని బహిరంగ లేఖలో గుర్తు చేశారు. అదే సమయంలో ఒకప్పుడు విస్తృతంగా అంగీకరించిన అనేక సిద్ధాంతాలు, నమ్మకాలు తర్వాత కాలంలో తప్పని తేలి తిరస్కరించబడ్డాయని తెలిపారు.
‘‘ఇలాంటి వ్యాఖ్యలు భారత విద్యా, పరిశోధనా వర్గాలకు ఎలాంటి సందేశాన్ని పంపుతున్నాయన్నది కూడా ఆందోళన కలిగించే అంశం. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు తమ అభిప్రాయాలను ప్రజా వేదికలపై స్వేచ్ఛగా వ్యక్తం చేయగలమనే నమ్మకం ఉండాలి. వారి వాదనలను విమర్శించవచ్చు, ఆధారాలను ప్రశ్నించవచ్చు, మరింత ఉన్నత ప్రమాణాల నిరూపణను కోరవచ్చు. కానీ విద్యావేత్తల పరిశోధన, విద్యార్హతలను తక్కువ చేయడం సరికాదు’’ అని లేఖలో పేర్కొన్నారు.
ప్రజా పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు తీసుకొచ్చిన ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్‌మెంట్ బిల్-2026’పై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అయితే ఆమె తన ప్రసంగంలో ప్రొఫెసర్ వి. కామకోటి పేరును నేరుగా ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఆమె వ్యాఖ్యలు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్‌ను ఉద్దేశించినవేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 215 మంది విద్యావేత్తలు విడుదల చేసిన బహిరంగ లేఖ రాజకీయ, విద్యా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

