ఏలూరు/ద్వారకాతిరుమల, జూన్ 19: ద్వారకాతిరుమల మండలం గుండుగోలను గుంట గ్రామంలో శుక్రవారం ప్రకృతి వ్యవసాయ బయోరిసోర్స్ సెంటర్ల (బీఆర్సీ) బలోపేతంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ఇన్‌పుట్ల ప్రాముఖ్యత, బీఆర్సీల నిర్వహణపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా బి. వెంకటేష్ మాట్లాడుతూ రైతులకు ఘనజీవామృతం, ద్రవజీవామృతం, బీజామృతం, పీఎండీఎస్ విత్తన కిట్లు, వివిధ రకాల కషాయాలు వంటి ప్రకృతి వ్యవసాయ ఇన్‌పుట్లు అందుబాటులో ఉంచి విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల దుకాణాలపై ఆధారపడకుండా రైతులు ప్రకృతి వ్యవసాయ బయోరిసోర్స్ సెంటర్ల సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రకృతి సిద్ధమైన ఈ ఇన్‌పుట్లు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు అందించడమే కాకుండా రైతుల ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించవని ఆయన వివరించారు. ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామీణ స్థాయిలో మరింత విస్తరించేందుకు బీఆర్సీలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా బీఆర్సీల నిర్వహణ, సేల్స్ రిజిస్టర్, బిల్ బుక్, స్టాక్ బుక్ నిర్వహణ విధానాలపై శిక్షణ అందించారు. అలాగే BRC E-Stock Web App వినియోగం, స్టాక్ నమోదు, అమ్మకాల నమోదు, డిజిటల్ రికార్డుల నిర్వహణపై ప్రాయోగిక శిక్షణ నిర్వహించారు.
క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్యాడర్ సభ్యులు రైతులకు బీఆర్సీల ప్రాముఖ్యతను వివరించి, రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించే దిశగా కృషి చేయాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీపీఎంలు వాలి, ఒబిలిశెట్టి గోపాలకృష్ణ, నవీన్, ప్రకృతి వ్యవసాయ క్యాడర్ సభ్యులు, రైతులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

