ఏలూరు/జంగారెడ్డిగూడెం, జూన్ 19: గిరిజన ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి తెలిపారు. శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఉప్పలమెట్ట 19వ వార్డు యానాదుల కాలనీని ఆయన, కమిషన్ సభ్యులతో కలిసి సందర్శించి స్థానిక గిరిజనుల సమస్యలను తెలుసుకుని అర్జీలు స్వీకరించారు.
సందర్శనలో భాగంగా కాలనీలో శిథిలావస్థకు చేరిన నివాస గృహాలు, విద్యుత్ స్తంభాలు, వ్రేలాడుతున్న విద్యుత్ తీగలు, తాగునీటి సదుపాయాలు, రహదారులు, పారిశుద్ధ్య పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. అనంతరం మల్టీపర్పస్ హాలులో నిర్వహించిన సమావేశంలో గిరిజన ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సోళ్ల బొజ్జిరెడ్డి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కాలనీలో గుర్తించిన సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనుల సంక్షేమం కోసం ఎస్టీ కమిషన్ నిరంతరం పనిచేస్తోందని, సమస్యలు ఎదురైనప్పుడు అర్జీ రూపంలో కమిషన్‌కు పంపిస్తే వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు కాకి లక్ష్మి, గొర్లె సునీత, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు, గిరిజన ప్రజలు పాల్గొన్నారు.

