ఏలూరు/పెదవేగి, జూన్ 19: పెదవేగి మండలంలోని పెదవేగి, కొప్పులవారిగూడెం గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన రైతుల సమావేశాల్లో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ ఆదేశాల మేరకు ప్రకృతి వ్యవసాయ ట్రైనింగ్ అసోసియేట్ (ఎన్‌ఎఫ్‌ఏ) నవీన ఘనజీవామృతం తయారీ విధానం, దాని ప్రయోజనాలపై రైతులకు వివరించారు.
ఈ సందర్భంగా నవీన మాట్లాడుతూ ఆవుపేడ, ఆవుమూత్రం, బెల్లం, శనగపిండి, మట్టితో తయారుచేసే ఘనజీవామృతం భూమిలో సూక్ష్మజీవుల వృద్ధిని ప్రోత్సహించి భూసారాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. ఇది పంటలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వేర్ల అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు.
అలాగే నేలలో తేమ నిల్వ ఉండేలా చేసి పంటల పెరుగుదల, దిగుబడి, నాణ్యత పెంపులో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. భూమిలో వానపాముల సంఖ్య పెరగడం వల్ల పోషకాల లభ్యత మెరుగై పంటలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు.
జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఆదేశాల మేరకు ఈ వారం మొత్తం ప్రధాన పంటలకు అవసరమైన ఘనజీవామృతం తయారీపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో భూమి ఆరోగ్యాన్ని కాపాడే ఈ ప్రకృతి వ్యవసాయ ఇన్‌పుట్‌ను ప్రతి రైతు స్వయంగా తయారు చేసుకుని వినియోగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌ఎఫ్ జ్ఞానాంబిక, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ నాగమణి, రైతులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

