ఏలూరు, జూన్ 17: ఏలూరు III టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు భారీ దాడి నిర్వహించి 32 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ రోజు ఉదయం సీతాపురం గ్రామం సమీపంలో ఏలూరు–విజయవాడ రహదారిపై సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.ఎన్.వి.వి. రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు, EAGLE టీమ్ సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న మారుతి బాలెనో కారును, దానికి ఎస్కార్ట్‌గా ఉన్న మోటార్‌సైకిల్‌ను ఆపి తనిఖీ చేయగా కారులోని డిక్కీలో 18 ప్యాకెట్లలో మొత్తం 32 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు.
పోలీసులు వెంటనే వాహనాల్లో ప్రయాణిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా, వారు ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి చింతపల్లి–రాజమహేంద్రవరం మార్గం ద్వారా శ్రీకాళహస్తికి తరలిస్తున్నట్లు అంగీకరించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
స్వాధీనం చేసిన వాటిలో 32 కిలోల గంజాయి, ఒక మారుతి బాలెనో కారు (AP40 BR 9084), ఒక హీరో గ్లామర్ మోటార్ సైకిల్ (AP39 DW 6944) ఉన్నాయని తెలిపారు.
నిందితులలో పలువురిపై గతంలో కూడా NDPS కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. గంజాయి సరఫరా నెట్‌వర్క్‌లో మరింత మంది ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. అవసరమైతే పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు లేదా EAGLE బృందానికి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

