Ticker

6/recent/ticker-posts

కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై కక్షసాధింపు చర్యలు: కాకాణి గోవర్ధన్ రెడ్డి


సూళ్లూరుపేట, జూన్ 21: అక్రమ కేసుల్లో 97 రోజులపాటు జైలులో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డికి బెయిల్ మంజూరై విడుదల కావడంతో మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి ఆయనను పరామర్శించారు.


ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సత్యనారాయణ రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు సృష్టించి 97 రోజులపాటు జైలులో ఉంచి కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. అక్రమ ఇసుక రవాణాను ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే ఆయన చేసిన తప్పని పేర్కొన్నారు.

ఒక కేసులో బెయిల్ లభించినప్పుడల్లా మరో కేసులో పీటీ వారెంట్లు జారీ చేసి జైలులోనే ఉంచేందుకు కుట్రలు పన్నారని విమర్శించారు. వయస్సు, ఆరోగ్య పరిస్థితిని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని, వైద్యులు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పినా నిర్లక్ష్యం చేశారని అన్నారు.

సత్యనారాయణ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, కందుకూరు నియోజకవర్గ పరిశీలకుడిగా, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి విధేయుడిగా ఉండటమే ఆయనపై చర్యలకు కారణమని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

సత్యనారాయణ రెడ్డి విడుదల సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు హాజరుకావడం ఆయనపై ప్రజలకు ఉన్న ఆదరణకు నిదర్శనమని పేర్కొన్నారు. తాను 86 రోజులు, సత్యనారాయణ రెడ్డి దాదాపు 100 రోజులు జైలులో ఉన్నప్పటికీ ధైర్యంగా నిలబడ్డామని తెలిపారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలవుతోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు.

కష్టకాలంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్వయంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారని, చట్టపరమైన సహాయం కూడా అందించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నిరంతరం కుటుంబానికి అండగా నిలిచారని కొనియాడారు.

సత్యనారాయణ రెడ్డి విడుదల కావడం ఆనందంగా ఉందని, కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజలు రాబోయే రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెబుతారని కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.