ANDRAPRADESH, MAY 27: పసుపు జెండా పండుగ మహానాడులో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ పై కీలక సందేశాలు వెలువడ్డాయి. “జై తెలుగుదేశం” నినాదాలతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల త్యాగాలు, రాష్ట్ర పునర్నిర్మాణ లక్ష్యాలపై భావోద్వేగంగా మాట్లాడారు. ప్రపంచ పరిస్థితులు, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గినా, కార్యకర్తల్లో జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. అన్ని క్లస్టర్లను అనుసంధానిస్తూ పార్టీ శక్తిని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
“పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసం”
జాతీయ జెండా దేశానికి గౌరవమైతే, పసుపు జెండా తెలుగువారి గౌరవం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం జెండా కనిపిస్తే ప్రజల్లో నమ్మకం, భరోసా కలుగుతుందని పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచే కూడు, గూడు, నీడ వంటి సంక్షేమ లక్ష్యాలతో ప్రజల మధ్య ఉందని గుర్తుచేశారు. విజన్ పాలిటిక్స్‌కు రూపం టీడీపీ అని, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఈ పార్టీ ప్రతీకగా నిలిచిందన్నారు.
“45 ఏళ్లుగా ప్రజల కోసం పోరాటం”
గత 45 ఏళ్లుగా టీడీపీ ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులు ఎదురైనా పార్టీ వెనక్కి తగ్గలేదన్నారు. టీడీపీ కార్యకర్తల త్యాగాలను గుర్తు చేస్తూ, “చంద్రయ్య లాంటి కార్యకర్తను నరుకుతున్నా.. జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ అమరుడయ్యాడు” అని భావోద్వేగానికి లోనయ్యారు. అలాంటి కార్యకర్తల స్పూర్తి పార్టీకి చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పారు.
“జైలు, అరెస్టులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు”
తనను అక్రమంగా జైలుకు పంపారని, నారా లోకేష్ చేపట్టిన యువగళాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. పార్టీ నేతలను అరెస్టు చేసి, బాధితులనే నిందితులుగా మలిచారని విమర్శించారు. అయినా టీడీపీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడిందని, ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గలేదని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వ లక్ష్యాలపై దిశానిర్దేశం
ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పని చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత అప్పగించారని అన్నారు. ప్రభుత్వం పాలనలో అగ్రెసివ్‌గా, ప్రోగ్రెసివ్‌గా ముందుకు వెళ్తోందని చెప్పారు.
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. ఆస్తి హక్కు నుంచి “తల్లికి వందనం” వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు టీడీపీ మహిళల వెంటే ఉంటుందని హామీ ఇచ్చారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

